9 hours web series review | 9 అవర్స్ వెబ్ సిరీస్ రివ్యూ...తొమ్మిది గంటల్లో ఏం జరిగిందంటే...
దర్శకుడు క్రిష్ షో రన్నర్‌గా తెలుగులో రూపొందిన 9 అవర్స్ వెబ్‌సిరీస్ గురువారం డిస్నీప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ అయ్యింది. బ్యాంకు రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే...
బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. వెబ్‌సిరీస్‌లు అసలు రాలేదు. ఈ అరుదైన జోనర్‌లో దర్శకుడు క్రిష్ షో రన్నర్ తో వ్యవహరిస్తూ రూపొందిన వెబ్‌సిరీస్ 9 అవర్స్. ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 9 అవర్స్ నవల ఆధారంగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. తారకరత్న, మధుశాలిని, అజయ్, వినోద్‌కుమార్, అంకిత్, ప్రీతి అస్రానీ కీలక పాత్రలను పోషించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ద్వారా గురువారం ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ అయ్యింది.
ట్రెండింగ్ వార్తలు
బ్యాంకు రాబరీ ప్లాన్
విశ్వనాథ్ (వినోద్ కుమార్) జైలు సూపరెండెంట్ పనిచేస్తుంటాడు. గుర్రపుపందెం, బెట్టింగ్ ల కారణంగా అప్పుల పాలవుతాడు. వాటిని తీర్చే మార్గం కోసం ఎదురుచూస్తుంటాడు. రాజమండ్రి జైలు నుంచి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చిన ఖైదీ దశరథ రామయ్య (అజయ్) తో కలిసి బ్యాంకు రాబరీ ప్లాన్ చేస్తాడు విశ్వనాథ్. రాబరీ కోసం అదే జైలులో శిక్షను అనుభవిస్తున్న అంబాజీ, ఫణీంద్ర, శివాజీ అనే ఖైదీల పావులుగా వాడుకుంటారు. తొమ్మిది గంటల్లో ఈ దొంగతనం పూర్తిచేయాలని భావిస్తారు. ఒకే టైమ్‌లో సైదాబాద్, ముసారాంభాగ్ తో పాటు కోటి దక్కన్ ఇంపీరియల్ బ్యాంక్‌లలో దొంగతనం చేసేందుకు పథకం వేస్తారు.
సైదాబాద్, ముసారాంభాగ్ లో దొంగల ప్లాన్ వర్కవుట్ అవుతుంది. కానీ కోఠి బ్యాంకులో మాత్రం చిక్కుకుపోతారు. బ్యాంకు ఉద్యోగులతో పాటు అందులో బందీలుగా చిక్కుకుపోయిన వారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి బయటపడేందుకు దొంగలు ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు బందీల ప్రాణాలను కాపాడి దొంగలను పట్టుకోవాలని అఫ్జల్ గంజ్ సీఐ ప్రతాప్(తారకరత్న) ప్రయత్నిస్తుంటాడు. కోఠి బ్యాంకు నుంచి దొంగల బయటపడ్డారా? ఆ ప్లాన్ అమలు చేసిన దశరథరామయ్య ఎవరు? అసలు అతడు ఖైదీగా నాటకమాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? రాబరీ వెనుక ఎవరున్నారు? బందీలుగా చిక్కుకున్ననందు, శ్రావణి, పురుషోత్తం, సుగుణతో పాటు హీరో చంద్రశేఖర్ జీవితం ఏమైందన్నదే ఈ సిరీస్ కథ.
మల్లాది నవలతో..
మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 9 అవర్స్ అనే నవల లను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్‌ను రూపొందించారు. బ్యాంకు రాబరీ నేపథ్యానికి ప్రేమకథ, అవినీతి, పురుషాధికత్య లాంటి అంశాలను జోడిస్తూ దర్శకద్వయం జాకబ్ వర్గీస్, నిరంజన్ కౌషిక్ సిరీస్ ను తెరకెక్కించారు.
తొమ్మిది ఎపిసోడ్స్...
తొమ్మిది ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేసుకుంటూ క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల ఊహలకు అందకుండా నడిపించడంలో దర్శకద్వయం చాలా వరకు సక్సెస్ అయ్యారు. మలుపులను కూడా ఎంగేజింగ్‌గా రాసుకున్నారు. బ్యాంకు రాబరీ కథతో మొదటుపెట్టి సర్‌ప్రైజ్ ఎండింగ్‌తో సిరీస్‌ను ముగించారు. బ్యాంకు దొంగతనానికి వేసిన ఎత్తు ఇంట్రెస్టింగ్ ఉంది. అందులో చిక్కుకున్న వారి మధ్య ఎమోషన్‌ను జోడిస్తూ కథను ముందుకు నడిపించారు. నందు, శ్రావణి మధ్య ప్రేమ, సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండే ఈగో ఇష్యూస్, స్నేహితుడి భార్యపై కన్నేసిన పురుషోత్తం ఎపిసోడ్ ఇలా మెయిన్ స్టోరీకి పలు ఉపకథలను ముడిపెడుతూ కథ, కథనాలు ఆసక్తికరంగా సాగుతాయి. చివరి రెండు ఎపిసోడ్స్ ఈ సిరీస్ కు బలంగా నిలిచాయి. వాటిలో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. రాబరీ వెనుక ఉన్న కారణమేమిటనే ప్రశ్నలకు సమాధానం ముగింపులో చూపించలేదు. రెండో సీజన్‌లోనే ఆ చిక్కుముడిని విప్పబోతున్నట్లుగా ఎండింగ్ లో చూపించడం కొంత డిస్సపాయింట్ చేస్తుంది.
ప్రతి పాత్రలో మరో కోణం
ఈ సిరీస్ లో కనిపించే ప్రతి పాత్ర వెనుక మరో కోణం ఉంటుంది. పైకి మంచివారుగా నటించే క్యారెక్టర్ లో విలనిజం షేడ్స్ కనిపిస్తాయి. నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ లో మంచితనాన్ని చూపించడం ఆకట్టుకుంటోంది. రాబరీ ప్లాన్ చేసిన దొంగ రవివర్మతో నాకు కనిపించిన మంచి మనిషివి నువ్వే అంటూ బందీగా చిక్కుకున్న బాలుడు చెప్పే డైలాగ్ అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మంచివాళ్లను చూసి లోకం భయపడదంటూ వచ్చే ఆ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే పురుషోత్తం ట్రాక్ కూడా అలరిస్తుంది.
తారకరత్న రీఎంట్రీ...
నిజాయితీతో పాటు షార్ట్ టెంపర్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా తారకరత్నకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కింది. భర్తను అపార్థం చేసుకునే చిత్ర అనే జర్నలిస్ట్ గా మధుశాలిని చక్కటి నటనను కనబరిచింది. జైలులోనే ఉంటూ బ్యాంకు రాబరీ ప్లాన్ ను నడిపించే ఖైదీ దశరథ రామయ్యగా అజయ్ పాత్ర ఆకట్టుకుంటుంది. మధుశాలిని, అజయ్ పాత్రల ఎండింగ్ సస్పెన్స్ ను కలిగిస్తుంది. రవివర్మ, శ్రీతేజ్, రవిప్రకాష్ తో పాటు మిగిలిన వారందరూ తమ నటనతో మెప్పించారు. 1985 బ్యాక్‌డ్రాప్ లో సాగే కథ ఇది. ఆనాటి కాలం లో ఉన్న అనుభూతిని కలిగించడం కోసం ఇండియానా జోన్స్, అమావాస్యచంద్రుడు లాంటి సినిమా పోస్టర్స్ చాలా ఫ్రేమ్స్‌లో చూపిస్తూ మ్యానేజ్ చేశారు.
వేగం లోపించింది.
క్రైమ్ థ్రిల్లర్ కథల్లో వేగం ముఖ్యం. అదే ఇందులో లోపించింది. ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాలే ఉన్నా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా లాజిక్స్ మిస్సయ్యారు. రాబరీ చేసిన దొంగ స్సెషల్ పోలీస్ గా నాటకమాడుతూ వారిటీమ్ లోనే జాయిన్ అయినా ఎవరూ గుర్తుపట్టకపోవడం సిల్లీగా అనిపిస్తుంది. రాబరీ వచ్చిన దొంగలు మందుతాగుతూ, ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ టైమ్ పాస్ చేయడం ఆకట్టుకోదు. తాము తప్పించుకోవడానికి బందీలు చేసే ప్లాన్స్ ను కొత్తగా రాసుకుంటే బాగుండేది. ఇలా చాలా మిస్టేక్స్ ఈ సిరీస్ లో కనిపిస్తాయి.
ఓపికగా చూస్తే...
చిన్న చిన్న లోపాలను పట్టించుకోకుండా మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకుంటే 9అవర్స్ ను చూడొచ్చు. కొన్ని ఎపిసోడ్స్ ఓపికగా భరిస్తే చివరలో మాత్రం ఎంగేజింగ్ ను కలిగిస్తుంది..
రేటింగ్- 2.5/5