Game Changer Songs Budget: గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలకు భారీ ఖర్చు.. ఐదు సాంగ్స్‌కు ఎన్ని కోట్లంటే.. శంకర్ మార్క్
Game Changer Songs Budget: గేమ్ ఛేంజర్ సినిమాలో పాటల చిత్రీకరణ కోసం అయిన ఖర్చు వివరాలు బయటికి వచ్చాయి. ఐదు పాటల షూటింగ్ కోసం భారీ బడ్జెట్‍ను మూవీ టీమ్ వెచ్చించింది. గ్రాండ్ విజువల్స్‌తో ఈ పాటలు ఉండనున్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్రాల్లో పాటలు గ్రాండ్ విజువల్స్, భారీ సెట్లతో ఉంటాయి. పాటల చిత్రీకరణకు నిర్మాతలతో భారీగానే ఆయన ఖర్చు చేయిస్తారు. రోబో, రోబో 2.0, ఐ సహా శంకర్ తెరకెక్కించిన చాలా చిత్రాల్లో ఇది జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోనూ శంకర్ ఇదే ఫాలో అయ్యారు. ఈ సినిమాలో పాటల షూటింగ్ కోసం భారీ బడ్జెట్ అయిందని సమాచారం బయటికి వచ్చింది. ఓ మిడ్ రేంజ్ మూవీకి అయ్యేంత బడ్జెట్‍ను పాటల చిత్రీకరణ గేమ్ ఛేంజర్స్ ప్రొడ్యూజర్లు పెట్టేశారట. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
5 పాటలు.. రూ.75కోట్లు
గేమ్ ఛేంజర్ చిత్రంలో ఐదు పాటల చిత్రీకరణకు సుమారు రూ.75కోట్ల ఖర్చు అయిందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. పాటలకు భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్, చాలా మంది బ్యాక్‍గ్రౌండ్ డ్యాన్సర్లను ఉపయోగించారు. దీంతో ఖర్చు భారీగా అయింది. ఏకంగా పాటలకే రూ.75కోట్ల బడ్జెట్‍ను నిర్మాతలు వెచ్చించారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.350కోట్లు అని అంచనా.
భారీతనంతో పాటలు
గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఇప్పటికే జరగండి, రా మచ్చా మచ్చా, నానా హైరానా, దోప్ సాంగ్స్ వచ్చాయి. లిరికల్ వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఈ పాటలన్నీ గ్రాండ్‍నెస్‍తో ఉండనున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. జరగండి సాంగ్ కోసం భారీ సెట్, సుమారు 600 మంది డ్యాన్సర్లను వినియోగించినట్టు తెలుస్తోంది. 13 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరిగింది. రా మచ్చా మచ్చా సాంగ్ కోసం వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లు కనిపిస్తారు. నానా హైరానా, దోప్ పాటల్లో విజువల్స్ రిచ్‍గా, గ్రాండ్ లుక్‍తో ఉన్నాయి. నానా హైరానా పాటను న్యూజిలాండ్‍లో ఇన్‍ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించింది మూవీ టీమ్. దోప్ కోసం భారీ సెట్‍తో పాటు విదేశీ డ్యాన్సర్లను వినియోగించారు. ఈ మూవీ నుంచి మరో సాంగ్ రావాల్సి ఉంటుంది. మొత్తంగా శంకర్ తన మార్క్ ఉండేలా గ్రాండ్‍గా ఈ మూవీలోని పాటలను చిత్రీకరించారు. ఏకంగా ఐదు పాటల షూటింగ్‍కే రూ.75 కోట్లు ఖర్చు అయ్యాయి.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో రామ్‍చరణ్ కనిపించనున్నారు. రాజకీయాల చుట్టూ సాగే యాక్షన్ డ్రామా మూవీగా శంకర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని దిల్‍రాజు ఇప్పటికే చెప్పారు.
గేమ్ ఛేంజర్ చిత్రం ప్రమోషన్లలో భాగంగా విజయవాడలో రామ్‍చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటైంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఎత్తైన కటౌట్‍గా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి తొలి వారంలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం ఓ ఈవెంట్ ఉండొచ్చు. ఇటీవలే డల్లాస్‍లో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఓ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో రామ్‍చరణ్ సరసన హీరోయిన్‍గా కియారా అడ్వానీ నటించగా.. ఎస్‍జే సూర్య, అంజలి కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం