Aattam OTT: జాతీయ అవార్డు గెలిచిన ఈ మలయాళ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే.. స్టోరీ ఇదే
Aattam OTT Streaming: ఆట్టం సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పురస్కారం కైవసం చేసుకుంది. ఈ సస్పెన్స్ డ్రామా మూవీని ఇప్పుడు ఏ ఓటీటీలో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మలయాళ సినిమా ‘ఆట్టం’ పురస్కారం గెలిచింది. జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. 2022కు గాను జాతీయ అవార్డులను కేంద్రం నేడు ప్రకటించింది. ఆట్టం సినిమా ఈ ఏడాది 2024 జనవరి 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ఆ ఏడాది మూవీగానే పరిగణనలోకి తీసుకొని అవార్డు ఇచ్చింది సమాచార, ప్రసార శాఖ. ఆట్టం సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమై ప్రశంసలు దక్కించుకుంది. థియేటర్లలోనూ పాజిటివ్ రెస్పాన్ దక్కించుకుంది.
ఆట్టం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
ఆట్టం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సస్పెన్స్ చాంబర్ డ్రామా మూవీ మార్చిలోనే ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మలయాళం భాషలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఉంది. అయితే, తెలుగు, ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆట్టం సినిమాకు ఆనంద్ ఏకర్షి దర్శకత్వం వహించారు.
ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక ఆట్టం సినిమా మరింత పాపులర్ అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీల్లో చూసిన చాలా మంది ప్రశంసలు కురిపించారు. మూవీ చాలా బాగుందని, తప్పక చూడాలంటూ పోస్టులు చేశారు. ఇప్పుడు ఆట్టం మూవీ ఏకంగా జాతీయ ఉత్తమ మూవీ అవార్డును కైవసం చేసుకుంది.
ఆట్టం మూవీలో నటీనటులు
ఆట్టం సినిమాలో జరీన్ షిహాబ్, వినయ్ ఫోర్ట్, కళాభవన్ షరోజాన్, జాలీ ఆంథోనీ, అజి తిరువంకులం, మదన్ బాబు, నందన్ ఉన్ని, ప్రశాంత్ మాధవన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. నాటకాలు ప్రదర్శించే ఓ బృందంలో ఉన్న ఏకైక అమ్మాయిపై లైంగిక దాడి జరగడం, ఆ నేరం చేసిందెవరని గుర్తించేందుకు చర్చించుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
ఆట్టం సినిమాకు ఆనంద్ ఏకర్షి దర్శకత్వం వహించారు. అమెరికా కోర్ట్ రూమ్ సిరీస్ 12 యాంగ్రీమెన్ స్ఫూర్తిగా ఈ మూవీని తెరకెక్కించారు. మహిళల పట్ల పురుషుల ఆలోచన విధానం, ప్రవర్తన ఎలా ఉంటాయన్న విషయాలను ఆట్టంలో తెరపై చూపించారు ఆనంద్. సామాజిక పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లముందు ఉంచారు. అలాగే, ఉత్కంఠభరితంగానూ మూవీని తెరక్కించారు. ఈ సినిమాకు గాను ఆయనపై భారీస్థాయిలో ప్రశంసలు వచ్చాయి.
ఆట్టం సినిమాను జాయ్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాసిల్ సీజే సంగీతం అందించిన ఈ చిత్రానికి అనురుద్ అనీశ్ సినిమాటోగ్రఫీ చేశారు.
మూడు జాతీయ అవార్డులు
70వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఆట్టం సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం పురస్కారం దక్కింది. అలాగే, ఈ మూవీకి గాను ఉత్తమ స్క్రీన్‍ప్లేకు దర్శకుడు ఆనంద్ ఏకర్షికి అవార్డు సొంతమైంది. జాతీయ ఉత్తమ ఎడిటర్‌గా మహేశ్ భువనేంద్ అవార్డు దక్కించుకున్నారు.
ఆట్టం స్టోరీ
కేరళలో నాటకాలు ప్రదర్శించే ఓ బృందంలో 13 మంది ఉంటారు. ఈ బృందంలో ఒకే అమ్మాయి కాగా.. మిగిలిన వారందరూ పురుషులే. ఒకరోజు ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. అయితే, ఆ 12 మంది పురుషుల్లో ఆమెపై ఈ దుశ్చర్య చేసింది ఎవరనే అంశం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ క్రమంలో మనుషుల వ్యక్తిత్వాలు, సమయాన్ని బట్టి, ఎదుటి వ్యక్తిని బట్టి భిన్నంగా మాట్లాడే, ప్రవర్తించే గుణాలు బయటికి వస్తాయి.