OTT Valentines Week Films: ఈ వాలెంటైన్స్ వీక్‍లో రోజుకొకటి చూసేందుకు 7 తెలుగు లవ్ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..-7 telugu romantic love movies to watch on otts for this valentines week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Valentines Week Films: ఈ వాలెంటైన్స్ వీక్‍లో రోజుకొకటి చూసేందుకు 7 తెలుగు లవ్ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..

OTT Valentines Week Films: ఈ వాలెంటైన్స్ వీక్‍లో రోజుకొకటి చూసేందుకు 7 తెలుగు లవ్ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 07, 2025 11:48 AM IST

Telugu Movies OTT Valentines week: వాలెంటైన్స్ వీక్ మొదలైంది. ఏడు రోజుల్లో ప్రతీ రోజు ఓ లవ్ మూవీ చూడడం మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఈవారంలో రోజుకు ఒకటి చొప్పున ఈ ఏడు సినిమాలు చూడొచ్చు. అవేవంటే..

Telugu Movies OTT: ఈ వాలెంటైన్స్ వీక్‍లో రోజుకొకటి చూసేందుకు 7 తెలుగు లవ్ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..
Telugu Movies OTT: ఈ వాలెంటైన్స్ వీక్‍లో రోజుకొకటి చూసేందుకు 7 తెలుగు లవ్ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..

ప్రేమలో ఉన్న వారికి ప్రత్యేకమైన వాలెంటైన్స్ వీక్ నేడు (ఫిబ్రవరి 7 ) మొదలైపోయింది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే వరకు ఈ ప్రేమికుల వారం కొనసాగనుంది. ప్రేమలో ఉన్న వారిది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీలా ఉంటుంది. అందుకే తెలుగులో ప్రేమకథలతో వేలాది సినిమాలు వచ్చాయి. చాలా లవ్ స్టోరీ చిత్రాలు బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. క్లాసిక్‍లుగా నిలిచాయి. ఈ వాలెంటైన్స్ వీక్‍లో లవ్ స్టోరీలతో ఉండే చిత్రాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. అందుకే ఈ వారం రోజుకో చిత్రం చూసేందుకు ఏడు ఆప్షన్లు ఇక్కడ చూడండి. ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకోండి.

ఆర్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఆర్య (2004) చిత్రం క్లాసిక్ లవ్ మూవీగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‍బస్టర్ అయింది. అల్లు అర్జున్‍కు స్టైలిష్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందింది. వాలెంటైన్స్ డే వీక్‍లో చూసేందుకు మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఆర్య చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‍లో ఆదిత్య మూవీ ఛానెల్‍లోనూ ఉంది.

గీతాంజలి

కింగ్ నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి (1989) చిత్రం ఐకానిక్ లవ్ మూవీగా నిలిచింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు ఎమోషనల్‍గా టచ్ చేసింది. ఈ చిత్రంలో గిరిజ షెట్టార్ హీరోయిన్‍గా చేశారు. గీతాంజలి చిత్రాన్ని యూట్యూబ్‍లో ఫ్రీగా చూడొచ్చు.

బొమ్మరిల్లు

సిద్ధార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన బొమ్మరిల్లు (2006) భారీ హిట్ అయింది. కామెడీ, లవ్ స్టోరీతో ప్రేక్షకుల మెప్పించేలా ఈ చిత్రాన్ని భాస్కర్ తెరకెక్కించారు. ఎవర్‌గ్రీన్ లవ్ మూవీగా బొమ్మరిల్లు నిలిచింది. ఈ చిత్రాన్ని యూట్యూబ్‍లో చూడొచ్చు.

నువ్వు నేను

ప్రేమకు ఆస్తులు, డబ్బు ముఖ్యం కాదనే కథాంశంతో నువ్వు నేను (2001) చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత హసనందని హీరోహీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నువ్వు నేను చిత్రం సన్‍నెక్స్ట్ ఓటీటీతో పాటు యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.

మళ్లీమళ్లీ ఇది రానిరోజు

శర్వానంద్, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన మళ్లీమళ్లీ ఇది రానిరోజు (2015) చిత్రం కమర్షియల్‍గా పెద్ద సక్సెస్ కాకపోయినా మంచి లవ్ మూవీగా నిలిచింది. ప్రేమికులు ఎంత కాలం దూరంగా ఉన్న మనసులో ప్రేమ అలాగే ఉంటుందనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఈ మూవీకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‍లోనూ చూసేయవచ్చు.

సీతారామం

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన సీతారామం (2022) మంచి హిట్ అయింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీకి సాడ్ ఎండింగ్ ఉన్నా.. ప్రేమ ఎంత పవిత్రమైనదో అని తెలిపేలా ఉంటుంది. సీతారామం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.

వర్షం

ప్రభాస్, త్రిష (2004) ప్రధాన పాత్రలు పోషించిన వర్షం కూడా మంచి హిట్ అయింది. ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి ఎవరితోనైనా పోరాడతాడనే పాయింట్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శోభన్. ఈ మూవీ సన్‍నెక్స్ట్, ప్రైమ్ వీడియో ఓటీటీలతో పాటు యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.

ఇవి ఈ వాలెంటైన్స్ వీక్‍కు ఓ ఏడు సినిమాల ఆప్షన్లు. అయితే తెలుగులో ఇంకా చాలా మంచి లవ్ స్టోరీలతో చిత్రాలు ఉన్నాయి. వాటిపై కూడా ఈ వారంలో లుక్కేయొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం