12-digit Masterstroke: ఓటీటీలోకి మరో సూపర్ డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డు అసలు స్టోరీ ఇదీ
12-digit Masterstroke The Untold Story of Aadhaar: ఓటీటీలోకి మరో సూపర్ డాక్యుమెంటరీ రాబోతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి వ్యక్తి జేబులో ఉన్న ఆధార్ కార్డు అసలు చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే ఈ డాక్యుమెంటరీ చూడండి.
12-digit Masterstroke The Untold Story of Aadhaar: అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఇప్పుడు దేశంలో అందరి జేబుల్లో ఉన్న మ్యాజిక్ కార్డ్ ఆధార్. ఇండియాలోని మొత్తం 140 కోట్ల మందికి ఓ ప్రత్యేకమైన డిజిటల్ నంబర్ ఈ కార్డు ద్వారా లభించింది. ఇప్పుడన్ని సేవలూ ఈ కార్డుకే లింకవుతున్నాయి.
మరి ఈ కార్డు వెనుక ఉన్న అసలు స్టోరీ తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉందా? అయితే ఓటీటీలోకి వస్తున్న 12 డిజిట్ మాస్టర్‌స్ట్రోక్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆధార్ డాక్యుమెంటరీ చూడాల్సిందే.
ఆధార్ కార్డుపై డాక్యుమెంటరీ
అసలు ఆధార్ కార్డు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? వంద కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? ఆ ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లారు? ఇంత భారీ బయోమెట్రిక్ డేటాను ఎలా మేనేజ్ చేశారు? అన్న ప్రశ్నలకు ఇప్పుడీ 12 డిజిట్ మాస్టర్‌స్ట్రోక్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆధార్ డాక్యుమెంటరీ సమాధానం చెప్పనుంది.
ఈ డాక్యుమెంటరీని డాక్యుబె (Docubay) యూట్యూబ్ ఛానెల్ స్ట్రీమింగ్ చేయనుంది. శుక్రవారం (మే 3) నుంచి ఈ 12 డిజిట్ మాస్టర్‌స్ట్రోక్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆధార్ అందుబాటులోకి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఈ ఆధార్ తతంగాన్ని ముందుకు తీసుకెళ్లిన టెక్ మాంత్రికుడు నందన్ నీలేకనీతోపాటు మిగిలిన ముఖ్యులు ఈ ఆధార్ ప్రక్రియను వివరించడం చూడొచ్చు.
విడదీయలేని భాగం ఆధార్
మీ వేలిముద్రే మీ గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆధార్ కార్డు గురించి ఓ సభలో చెప్పిన నినాదంతో ఈ ట్రైలర్ ముగించారు. 12 అంకెల ఆధార్ నంబర్ ప్రతి ఒక్కరి జీవితాల్లో విడదీయలేని భాగం అయిపోయింది. రేషన్ కార్డు నుంచి విమానంలో టికెట్ బుకింగ్, స్కూల్ అడ్మిషన్ నుంచి శ్మశానంలో అంత్యక్రియల వరకు అన్నింటికీ ఇప్పుడీ ఆధార్ ఉండాల్సిందే.
అలాంటి ఆధార్ వెనుక జరిగిన తతంగాన్ని తెలుసుకోవాలంటే ఈ 12 డిజిట్ మాస్టర్‌స్ట్రోక్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆధార్ డాక్యుమెంటరీ తప్పకుండా చూడాల్సిందే. ఆధార్ సృష్టి వెనుక ఎంత మంది ఎన్ని రకాల కృషి చేశారో ఈ డాక్యుమెంటరీలో చూపించే ప్రయత్నం చేశారు. ఆధార్ అనే కాన్సెప్ట్ మొదలైనప్పటి నుంచీ ప్రభుత్వాలు మారినా అది ముందుకు వెళ్లిన తీరును ఇందులో కళ్లకు కట్టారు.
దేశంలోని ఇప్పటి డిజిటల్ విప్లవానికి పునాది ఆధార్ తోనే పడిందన్న సత్యాన్ని ఈ డాక్యుమెంటరీ చూపించనుంది. నందన్ నీలేకనీ నేతృత్వంలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రొఫెషనల్స్ ఈ ఆధార్ కు ఒక రూపం ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? వేలి ముద్రలు కూడా సరిగా లేని కోట్లాది మంది శ్రామికులు ఉన్న దేశంలో దానికి ప్రత్యామ్నాయంగా ఐరిస్ ను తీసుకొచ్చిన విధానం ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. మే 3 నుంచి డాక్యుబే యూట్యూబ్ ఛానెల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.