YS Jagan Strategy: ఏపీలో అభ్యర్థుల మార్పులు పూర్తి.. తాను చేయాల్సింది చేశా…ఇక బాధ్యత నేతలదేనన్న వైఎస్ జగన్
YS Jagan: ఏపీలో ప్రజలకు అందుతున్న సంక్షేమం కొనసాగాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
YS Jagan: రానున్న ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి హాజరైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లతో మంగళగిరిలో సమావేశం నిర్వహించారు.
రానున్న ఎన్నికల్లో జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే.. వాలంటీర్లు volunteers వ్యవస్ధ మాకు వద్దు, మళ్లీ జన్మభూమి janmabhumi కమిటీలు కావాలని మనంతట మనమే సంతకం పెట్టినట్టేనని జగన్ పేర్కొన్నారు.
మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తూ... ప్రతినెలా సంవత్సరం పొడువునా .. ఏ పథకం ఎప్పుడు వస్తుందో షెడ్యూల్ ఇచ్చి, క్యాలెండరు ఇచ్చి అమలు చేస్తున్న పథకాలన్నీ మనంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చినట్టేనని ప్రజలకు వివరించాలన్నారు.
అప్పుడు మళ్లీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. మరలా ఎవరు పేదల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదన్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఎక్కడా ఉండదని, పేదవాడి బ్రతుకు చిన్నాభిన్నమే అన్న సంకేతం ప్రతి ప్రతిపేదవాడి ఇంట్లోనూ వెళ్లాలని ప్రతి పేదవాడికి చెప్పాలన్నారు.
“మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం” పేరుతో సమావేశాన్ని నిర్వహించిన జగన్ ఐదేళ్లలోవైసీపీ సాధించిన విజయాలను, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
బూత్ స‌్థాయి వరకు బలోపేతం…
2024 ఎన్నికలకు మరో 45 రోజుల సమయమే ఉన్నందున పార్టీని గ్రామ స్ధాయి నుంచి బూత్ స్ధాయి వరకు బలపర్చుకుంటూ పోవాలన్నారు. 2019లో కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చామని రెండే రెండుపేజీలు ఎందుకంటే... ఆ మేనిఫోస్టో ప్రజలకు గుర్తుండాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు కూడా గుర్తుండాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ప్రతి మాట నెరవేరుస్తామని ధైర్యం ఉండాలన్నారు.
2019లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా 175 స్ధానాలకు 151 స్ధానాలతో అధికారంలోకి వచ్చాయని, 25కి 22 ఎంపీ స్ధానాలు గెల్చుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు పేజీల మేనిఫెస్టోని ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తూ చిత్తశుద్ధితో అడుగులు వేశామన్నారు.
5 సంవత్సరాల తర్వాత గర్వంగా కేడర్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ.. రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామస్దాయి వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా ప్రతి ఇంటికి వెళ్లి .. ఎన్నికల ముందు ఇవి చెప్పాం... చెప్పినవన్నీ చేశాం. 99శాతం హామీలన్నీ నెరవేర్చాం అని మేనిఫెస్టో తీసుకునివెళ్లి.. మీరే టిక్కు పెట్టిండి అని అడిగే చిత్తశుద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ 87శాతం ఇళ్లకు లబ్ధి కలిగిందని చెప్పారు. లంచాలు, వివక్షకు ఆస్కారం లేకుండా ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వేశామన్నారు. రూ.2.55 లక్షల కోట్లలో రూ.1400 కోట్లను కుప్పంలో అందించినట్టు జగన్ చెప్పారు.
సచివాలయం యూనిట్ ఆర్గనైజేషన్…
ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆ సచివాలయంలో మీకు సంబంధించి, అందులో అత్యంత నమ్మకమైన వ్యక్తులను గుర్తించి ఎన్నికల్లో వినియోగించాలన్నారు. సచివాలయం పరిధిలో కేడర్‌ను, అభిమానులను, వాలంటీర్‌లను అందరినీ దగ్గర చేయాలని దానిని నాయకులు రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 80 సచివాలయాలు ఉంటాయని సచివాలయ స్థాయిలో వారికి నేతల ఫోన్ అందుబాటులో ఉండాలని ఏ సచివాలయంలో, ఎక్కడ గ్యాప్ కనిపిస్తున్నట్టు మనకు చెప్పినా.. ఎప్పుడు ఫోన్ చేసినా మీరంతా ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో ఉండాలని, వారి మాటలు వినే పరిస్థితుల్లో ఉండాలన్నారు.
సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్, కేడర్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే అభ్యర్ధికి దగ్గర కావాలన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. సచివాలయంలో పెట్టిన వ్యక్తి ద్వారా బూత్ కమిటీల మీద ధ్యాస పెట్టాలని సూచించారు.
గతంలోనే వాలంటీర్‌తో పాటు గృహసారధులను వేశామని ప్రతి వాలంటీర్‌కు అనుసంధానంగా గృహసారధులతో కలిసి బూత్ కమిటీ సభ్యులుగా వేశామని ఈ వ్యవస్ధను మానిటర్ చేసేందుకు నలుగురు మనుషులు(ఒక బూత్ ఇన్‌ఛార్జి, ముగ్గురు కన్వీనర్లు) ఆ బూత్ కింద ఉన్న క్లస్టర్‌ను పర్యవేక్షించాలని జగన్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు ఈ ఆర్గనైజేషన్ ముఖ్యమన్నారు.
టిక్కెట్లన్నీ ఖరారు….
45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలని మన పార్టీలో దాదాపు టిక్కెట్లన్నీ కరారు అయ్యాయని జగన్ ప్రకటించారు. మార్చాల్సినవన్నీ 95 శాతం మార్పు చేశామని ఏదైనా ఇంకా ఒకటి అరా ఉంటాయన్నారు.
ఆర్గనైజైషన్ మీద ధ్యాస పెట్టాలని ఇందులో ఫెయిల్ అయితే ఎవరూ కాపాడలేరని ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంటిలో మంచి జరిగిందని ఏకంగా లెటర్లు రూపంలోఇచ్చి, జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఇచ్చిన పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. గతంలో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు వచ్చాయని ఈ సారి 175కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25ఎంపీలు రావాల్సిందే నన్నారు.