Kishanreddy: నిర్భయంగా ఓటు వేయాలన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishanreddy: తెలంగాణ ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాచిగూడలో సతీమణితో కలిసి కిషన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Kishanreddy: అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యం ప్రభావంతో ఓట్లను కొనాలని ప్రయత్నిస్తున్నారని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని, నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాచిగూడలోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని, ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని, తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు.
ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విధానాలను విమర‌్శించే ముందు ఓటు హక్కు ముఖ్యమైనదని, ఓటు వేయకుండా ఎవరికి ప్రభుత్వాల పనితీరును విమర్శించే అవకాశం రాదన్నారు. తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు.
ప్రజలు ఎవరికి భయ పడకుండా ఓటు వేయాలన్నారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలంతా ఓటు వేసిన తర్వాతే రోజు వారీ పనులు చేసుకోవాలన్నారు. మహిళలు, యువత, తెలంగాణ సమాజం మొత్తం స్పందించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు.