దిల్లీ ఎన్నికలకు ముందు 'ఆప్' వీడియోని లీక్ చేసిన ధ్రువ్ రాఠీ! నిషేధించే ముందే చూడండంటూ..
Unbreakable documentary : పోలీసులు స్క్రీనింగ్ నిలిపివేసిన ‘అన్బ్రేకబుల్’ డాక్యుమెంటరీని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆన్లైన్లో లీక్ చేశారు. ఈ డాక్యుమెంటరీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినది. ఇందులో ఏముందంటే..
ప్రముఖ యూట్యూబర్, వ్లోగర్ ధ్రువ్ రాఠీ మరో సంచలన వీడియో పోస్ట్ చేశారు! దిల్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదలవ్వాల్సిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు ఇటీవలే నిలిపివేయగా.. దానిని ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ అకౌంట్లో లీక్ చేశారు. దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.

ధ్రువ్ రాఠీ లీక్ చేసిన వీడియోలో ఏముందంటే..?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అచంచల పోరాటాన్ని చిత్రీకరిస్తుందని చెబుతున్న ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ పేరు “అన్బ్రేకబుల్” దీనిని ఆదివారం రాత్రి ధ్రువ్ రాఠీ పోస్ట్ చేశారు. “నిషేధం విధించే ముందే చూడండి,” అని యూట్యూబ్ వీడియోకి టైటిల్ ఇచ్చారు.
30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇన్‌స్టంట్‌గా వైరల్ అయ్యింది. విడుదలైన 13 గంటల్లోనే 41 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డాక్యుమెంటరీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి అతిషి, మనీశ్ శిశోడియా, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ వంటి కీలక నేతల ఇంటర్వ్యూలు ఉన్నాయి.
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగంగా సత్యేందర్ జైన్, మనీశ్ శిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌ని సీబీఐ, ఈడీలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత వారందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, అరెస్ట్‌కి ముందు- అరెస్ట్‌కి తర్వాత పార్టీలో మార్పులు వంటి వివరాలను చెబుతూ ఈ డాక్యూమెంటరీని రూపొందించారు. ఈ నేపథ్యంలో వీడియోలో కనిపిస్తున్న నేతలు.. తమపై కుట్ర జరిగిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి..
ఆప్ డాక్యుమెంటరీ 'అన్బ్రేకబుల్' చుట్టూ వివాదం ఏంటి?
ఎన్నికల మార్గదర్శకాలను పాటించలేదనే కారణంతో దిల్లీ పోలీసులు ఇటీవల ఆప్ డాక్యుమెంటరీ "అన్ బ్రేకబుల్" ప్రదర్శనను నిలిపివేశారు.
ఇటువంటి కార్యక్రమాలలు చేపట్టడానికి జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయంలో సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అనుమతి కోసం రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు నొక్కి చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పోలీసులు అలాంటి అనుమతిని ఇవ్వలేరని, తిరస్కరించలేరని వారు తెలిపారు.
అయితే ఈ సినిమా ఎన్నికల ప్రచారం కాదని, సినిమా స్క్రీనింగ్ సైట్లో ఎన్నికల జెండా, ప్రసంగం, ఎన్నికల ప్రచారం లేదని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు.
“ఇది ఎన్నికల కార్యక్రమం కాదు. ఎన్నికలతో దీనికి సంబంధం లేదు. ఇది ఏ పార్టీ గుర్తు, జెండా లేదు. పోలీసులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాం. ఇది గూండాయిజం, నియంతృత్వం,” అని కేజ్రీవాల్ మండిపడ్డారు.
70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.
సంబంధిత కథనం