Revanth Reddy : రేవంత్ రెడ్డిని ప్రజలు ఎందుకు నమ్మారు?
Revanth Reddy : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైపోయింది. అయితే ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని, ఆయనను ప్రజలు చాలా నమ్మారని చెప్పాలి.
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Telangana Assembly Election Results) కాంగ్రెస్ పార్టీకి గొప్ప విజయం అందించారు ప్రజలు. ఇందులో రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాత్ర చాలా కీలకం. అసలు తెలంగాణలో ఎక్కడికో వెళ్లిన కాంగ్రెస్ పార్టీని.. అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. ఉనికి పోయిందనుకున్న పార్టీకి ఊపిరి పోయడంలో రేవంత్ రెడ్డితోపాటుగా మరికొందరు నేతలు కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మాలని జనాలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీతోపాటుగా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడానికి కారణాలు ఏంటి?
కాంగ్రెస్ పార్టీ అనగానే.. మెుదట గుర్తుకు వచ్చేది.. అంతర్గత స్వేచ్ఛ. పార్టీలో ఎవరి మీద అయినా.. ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు రావడంతో చాలా మంది నేతల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొందరు పార్టీని వీడి కూడా బయటకు వెళ్లారు. అయితే వారిని సముదాయించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తనదైన స్ట్రాటజీతో కదిలారు. కోమటిరెడ్డి లాంటి కీలక నేతలు పార్టీని వదిలి వెళ్లినా.. మళ్లీ తిరిగి వస్తే.. వారితో సఖ్యత మెయింటెన్ చేశారు రేవంత్ రెడ్డి.
పార్టీలోని నేతలు కామెంట్స్ చేసినా రేవంత్ రెడ్డి సరిగా స్పందిచారు. గొడవలు వద్దు అన్నట్టుగానే ఉండటంతో కింది స్థాయి నేతల్లోనూ నమ్మకం కుదిరింది. దీంతో అప్పటికే బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. మరోవైపు టీడీపీలో రేవంత్ రెడ్డి పని చేయడం కూడా కలిసి వచ్చింది. టీడీపీకి ఉన్న క్యాడర్ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలవలేదు. ఇది గతంలో ఆ పార్టీలో పని చేసిన రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది.
అయితే అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి చక్కగా పట్టుకోగలిగారు. బీజేపీ పుంజుకుంటున్న సమయంలో కాంగ్రెస్ వైపు గాలి తిరిగేలా చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ రహస్య దోస్తులు అని చెప్పడంతో సఫలమయ్యారు. ఫలితంగా జనాలు కూడా ఈ విషయాన్ని నమ్మారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. దీంతో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సైన్యంలా పని చేశారు.
రేవంత్ రెడ్డి మేనియా కంటే ప్రభుత్వం వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని సరిగా క్యాచ్ చేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అధికారం ఇవ్వడంటూ జనంలోకి బాగా తీసుకెళ్లారు. దీంతో జనాలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరిగింది.
మరోవైపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరల పాలన అంతం చేద్దామంటూ సామాన్యులకు దగ్గర అయ్యే ప్రయత్నం బలంగా చేశారు రేవంత్. అంతేకాదు.. నేరుగా సీఎం కేసీఆర్‍ను ఢీ కొట్టేందుకు కామారెడ్డి బరిలో నిలిచారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీతోపాటుగా రేవంత్ రెడ్డి మీద కూడా నమ్మకం పెంచుకున్నారు. ప్రజల తరఫున రేవంత్ చేసిన కొన్ని ఆందోళనలు కూడా ఆయనకు జనాలను దగ్గర చేసింది.
అయితే రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ హవా కనిపించినా.. గ్రేటర్ హైదరాబాద్‍లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. హస్తం గాలి ఇక్కడ పని చేయలేదనే చెప్పాలి. గ్రేటర్ ప్రజలు బీఆర్ఎస్‍కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఇటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అటు ప్రజలు మార్పు కోరుకోవడం.., రేవంత్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది.