Telangana Election 2023 : కాంగ్రెస్ చేతికి 'తెలంగాణ' - మంత్రులుగా వీరికి ఛాన్స్ దక్కొచ్చు..!
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా… ఆ తర్వాత భట్టి పేరు రేసులో ఉంది.
Telangana Assembly Elections 2023 : తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత… తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సింగిల్ గానే అధికారంలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఏర్పాటు పనుల్లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

తెలంగాణలో అధికారంలోకి రావటంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రముఖంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్… ఎవరి పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రులుగా అవకాశం దక్కించుకునే వారిలో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రుల ఎంపికలో సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారాయి.
మంత్రులుగా ఛాన్స్ దక్కే ఎమ్మెల్యేలు…!
ఉమ్మడి కరీంనగర్ - పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుకు మంత్రులుగా ఛాన్స్ దక్కొచ్చు. పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందటమే కాకుండా… సామాజిక సమీకరణాలు కూడా కలిసిరానున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ - ఈ జిల్లా నుంచి వెడ్మ బొజ్జు (ఖానాపూర్) నుంచి గెలిచారు. ఎస్టీ కావటం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే జిల్లా నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వివేక్, వినోద్ లు మంత్రుల రేసులో ఉంటారు.
మెదక్ - ఈ జిల్లా నుంచి ఆందోల్ లో గెలిచిన దామోదరకు అవకాశం ఉండగా.. కీలకమైన శాఖను అప్పగించే అవకాశం ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి - ఈ జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), గడ్డం ప్రసాద్(వికారాబాద్)కు అవకాశం ఉంది. ఇద్దరు నేతలు కూడా సీనియర్లుగా గుర్తింపు పొందారు. కష్టకాలంలో కూడా పార్టీలో కీలకంగా పని చేశారు.
మహబూబ్ నగర్ - ఈ జిల్లా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కొల్లాపూర్ లో గెలిచిన జూపల్లి సీనియర్ నేతగా పేరుంది. మంత్రివర్గ రేసులో ఉండొచ్చని తెలుస్తోంది.
నల్గొండ - ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేసులో ఉన్నారు. వీరే కాకుండా జానారెడ్డికి కూడా ఛాన్స్ రావొచ్చని తెలుస్తుంది. ఈ
ఉమ్మడి వరంగల్ - ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. అయితే ఈ జిల్లా నుంచి గెలిచిన సీతక్క(ములుగు), సురేఖ(వరంగల్ తూర్పు)కు మంత్రులుగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సీతక్క ఎస్టీ, సురేఖ బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావటం కలిసివచ్చే అవకాశం.
ఖమ్మంలో - ఈ జిల్లా నుంచి సీనియర్ నేతలు తుమ్మల, పొంగులేటి, భట్టి విక్రమార్క రేసులో ఉన్నారు. భట్టికి కీలక పదవి దక్కే అవకాశం ఉంటుంది. పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘమైన పాదయాత్రను కూడా చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ - ఈ జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(బోధన్) కి అవకాశం ఉంది.
హైదరాబాద్ - ఈ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. అయితే కీలకమైన భాగ్యనగరం నుంచి ప్రాతనిధ్యం ఉండాలని భావిస్తే….ఒకరు లేదా ఇద్దరు నేతలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీగా నియమించే అవకాశాలను బట్టి ఈ నిర్ణయం ఉండొచ్చు.