Station Ghanpur : స్టేషన్ ఘన్ పూర్ లో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం- సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
Station Ghanpur : స్టేషన్ ఘన్ పూర్ లో ఏ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం అనే సెంటిమెంట్ ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ రిపీట్ అయింది. దీంతో ప్రధాన పార్టీలు ఈ స్థానంలో విజయం కోసం పోటీపడుతున్నాయి.
Station Ghanpur : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. అదే పార్టీ రాష్ట్రంలోనూ అధికారం చేజిక్కించుకుంటుందనే సెంటిమెంట్ కొనసాగుతోంది. గత ఏడెనిమిది ఎలక్షన్లలో అలాగే జరగడంతో ఇప్పుడు స్టేషన్ ఘన్ పూర్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎలాగైనా స్టేషన్ ఘన్ పూర్ లో నెగ్గితీరాలనే ఉద్దేశంతో అన్ని ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి.
1985 నుంచి అదే సెంటిమెంట్
1985 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ లో నెగ్గిన పార్టీ రాష్ట్రంలోనూ జెండా ఎగురవేస్తూ వస్తోంది. నాటి నుంచి 2018 సాధారణ ఎన్నికల వరకూ అదే జరిగింది. 1985లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానాల ఆనందంపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జపల్లి సారయ్య విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ గెలువగా.. రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బోనగిరి ఆరోగ్యం.. టీడీపీ అభ్యర్థి బొజ్జపల్లి సారయ్యపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పవర్ లోకి రాగా.. డా.మర్రి చెన్నారెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైంది.
ఇక 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడియం శ్రీహరి విజయం సాధించగా.. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 1999 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ మళ్లీ టీడీపీ నుంచి కడియం శ్రీహరి సాధించగా.. రాష్ట్రంలో కూడా అదే పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2001లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కూడా పోటీలో నిలిచింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, వామపక్షాల కూటమి పోటీలో నిలవగా.. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ పార్టీ నుంచి డా.గుండె విజయరామారావు విజయం సాధించారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కూటమితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జోరుగా నడుస్తుండటం, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనే కారణంతో టీఆర్ఎస్ ఆ కూటమి నుంచి తప్పుకుంది. 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య గెలుపొందారు. ఇక రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడింది.
రాష్ట్రం వచ్చిన తరువాత ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత మొదటిసారి 2014 లో జనరల్ ఎలక్షన్స్ జరగగా.. స్టేషన్ ఘన్ పూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా డా.తాటికొండ రాజయ్య పోటీలో నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరామారావుపై విజయం సాధించారు. కాగా తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికార పీఠం దక్కించుకుంది. ఇక చివరి సారిగా 2018 సాధారణ ఎన్నికల్లో మళ్లీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీనే గెలవగా.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం రెండోసారి కొలువు దీరింది. 1985 నుంచి 2018 వరకు ఎనిమిది సార్లు సాధారణ ఎన్నికలు జరగగా.. ఆ ఎనిమిది సార్లు స్టేషన్ ఘన్ పూర్ లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం.
15 ఎన్నికల్లో 12 సార్లు
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తొలిసారి 1957లో ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు మొత్తంగా 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అందులో కేవలం మూడు సార్లు మాత్రమే ఫలితాలు తారుమారు కాగా.. 12 సార్లు స్టేషన్ ఘన్ పూర్ లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకోవడం విశేషం. కాగా కాంగ్రెస్ ప్రభావం కొనసాగుతున్న సమయంలోనే 1962లో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నెల్లుట్ల మోహన్రావు, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి తోకల లక్ష్మారెడ్డి, 1983 లో రాష్ట్రంలో కొత్తగా ఎన్టీఆర్ అధినాయకత్వంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పై విజయం సాధించడం గమనార్హం.
మూడు పార్టీల పోరాటం
స్టేషన్ ఘన్ పూర్ సెంటిమెంట్ కొనసాగుతుండటంతో రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుతున్న అన్ని ప్రధాన పార్టీలు ఈ సీటుపై గురి పెట్టాయి. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిరా, బీజేపీ నుంచి డా.గుండె విజయరామారావు పోటీలో ఉండగా.. ఎవరికి వారు హోరాహోరీ తలపడుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ స్థానాన్ని గెలిస్తే.. రాష్ట్రంలోనూ పవర్ దక్కుతుందనే భావనతో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనగా.. ఈ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
రిపోర్టింగ్ : హెచ్.టి తెలుగు, వరంగల్ ప్రతినిధి