TS Dy CM Issue: తెలంగాణలో డిప్యూటీ సిఎం ఎంపికపై రగడ..ఆ పదవి ఒక్కరికేనని మెలిక
TS Dy CM Issue: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డిప్యూటీ సిఎం ఎంపిక వ్యవహారం కూడా కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే డిప్యూటీ సిఎం, హోంమంత్రి వంటి పదవుల్ని నమ్మకంగా ఉండే వారికి అప్పగించాలని రేవంత్ రెడ్డి భావించినా అది కూడా నెరవేరే పరస్థితి కనిపించడం లేదు.
TS Dy CM Issue: తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికతో పాటు డిప్యూటీ సిఎం వ్యవహారం కూడా కీలకంగా మారింది. డిప్యూటీ సిఎం పదవి ఎవరిని వరిస్తుందనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తే ఇద్దరికి డిప్యూటీ సిఎం పదవి ఇవ్వాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని డిప్యూటీ సిఎంగా ఎంపిక చేసినా, తనకు నమ్మకంగా ఉండే మరొకరిని కూడా డిప్యూటీ సిఎం చేయడం ద్వారా ప్రత్యర్థుల బలం పెరగకుండా చూడాలని రేవంత్ భావించినట్టు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత రాకపోవడంతో పాటు, డిప్యూటీ సిఎం విషయంలో కూడా ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.పదేళ్ల పాటు సిఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చూసిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలు అప్పగించక పోవడంలో ఉన్న హేతుబద్దతను కూడా భట్టి లేవనెత్తినట్టు తెలుస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నపుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకరిని ఎంపిక చేయడం ఏమిటని కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సంతోషం కంటే కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సమస్యలు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. నాలుగైదు గ్రూపులుగా గెలిచిన ఎమ్మెల్యేలు చీలిపోవడంతో ఎవరిని సంతృప్తి పరచాలో తెలియని పరిస్థితిని ఆ పార్టీ నాయకత్వం ఎదుర్కొంటోంది. సాయంత్రంలోగా సిఎల్పీ నాయకుడిని ఎంపిక చేస్తామని ఏఐసిసి అధ‌్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
మరోవైపు డిప్యూటీ సిఎం పదవుల విషయంలో కూడా సీనియర్లు స్పష్టత కోరుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తే తమకు ఖచ్చితంగా డిప్యూటీ సిఎం పదవి కావాలని భట్టి అభిమతంగా ఉంది. అది కూడా మరొకరితో పంచుకోడానికి వీల్లేదని ఒక్కడితే ఆ పదవిని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారు. తనకు కూడా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు.