Gone Prakash : పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తులు గోప్యంగా ఉంచారు, గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు
Gone Prakash : పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో తప్పుగా చూపారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం, ఈడీ, ఐటీ శాఖలకు ఫిర్యాదు చేశానన్నారు.
Gone Prakash : పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణా రావు తన ఆస్తులు, పాన్ కార్డులు, అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా చూపెట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ....ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఈడీ, ఆదాయ పన్ను శాఖ, హోమ్ శాఖ, ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశానని, విజయ రమణారావు తప్పులు తేలితే ఆరేళ్లు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు
ఆదాయపన్ను అధికారులకు ఫిర్యాదు చేస్తా
ఎన్నో వ్యాపారాల్లో తన పాత్ర ఉన్న అవేమి జతపరచలేదని హైదరాబాద్ లో ఆదాయపన్ను అధికారులకు ఫిర్యాదు చేస్తానని గోనె ప్రకాష్ అన్నారు. విజయ రమణా రావుకి ఓటు వేస్తే పెద్దపల్లి ప్రజల ఓటు వృథా అవుతుందన్నారు. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉండి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నందుకు, చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటేయాలని హితవు పలికారు. విజయ రమణా రావుకి వ్యతిరేకంగా ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసే అవసరం తనకు లేదని...తనను మోసం చేసి ఇబ్బంది పెట్టారు కాబట్టే దర్యాప్తు సంస్థల దృష్టికి విజయ రమణా రావుపై ఫిర్యాదు చేస్తున్నానన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఎవరు మంచివాళ్లో ఎవరు ముంచే వాళ్లో ఆలోచించుకోవాలని హితవు పలికారు.
రిపోర్టర్: గోపికృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా