పవన్ కల్యాణ్ జనసేన పార్టీ(Pawan Kalyan Janasena Party).. బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేసింది. 8 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పవన్ మేనియా కూడా ఇక్కడ పని చేయలేదు. జనాలు గట్టిగా తిరస్కరించారు. కిందటిసారి ఏపీలో ఎదురైనటువంటి పరిస్థితే.. తెలంగాణలో ఈసారి జనసేన ఎదుర్కోవలసి వచ్చింది.
చాలా రోజుల నుంచి తెలంగాణలో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న జనసేనకు బీజేపీ తోడైంది. పొత్తుతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసింది. పోటీ చేసిన జనసేన అభ్యర్థుల డిపాజిట్ కూడా గల్లంతైంది. అదే బీజేపీ పార్టీ 9 స్థానాల్లో గెలిచే దిశగా కొనసాగుతోంది. జనసేన పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో జనసైనికులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
కోదాడ - మేకల సతీశ్ రెడ్డి, తాండూర్-నేమూరి శంకర్ గౌడ్, ఖమ్మం-మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం-లక్కినేని సురేందర్ రావు, అశ్వారావుపేట(ఎస్టీ)-ముయబోయిన ఉమాదేవి, వైరా(ఎస్టీ)-సంపత్ నాయక్, నాగర్ కర్నూల్-వంగల లక్ష్మణ్ గౌడ్, కూకట్‍పల్లి-ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. పోటీ చేశారు.
అయితే ఈ అభ్యర్థులు జనసేన టికెట్ తీసుకుని పోటీ చేసినా.. ఫలితం లేదు. కూకట్‍పల్లిలో అయినా జనసేన ప్రభావం చూపిస్తుందని చాలా మంది అనుకున్నా్రు. కానీ అలాంటిదేమీ లేకుండా పోయింది. మూడో స్థానంలో నిలిచింది. ఈ 8 స్థానాల్లో జనసేన గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని కొంతమంది అనుకున్నారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. కూకట్ పల్లి మినహా 7 చోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. నిజానికి కూకట్‍పల్లిలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ స్థానంపై పవన్ కల్యాణ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ జోరులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిచారు.
బీజేపీతో కలిసి బరిలోకి దిగినా.. తెలంగాణ ప్రజలు జనసేనను పట్టించుకోలేదు. 8 స్థానాల్లోనూ ఆ పార్టీ ఎదురుదెబ్బ చూడాల్సి వచ్చింది. ఎనిమిది స్థానాల్లో గెలిచి కింగ్ మేకర్ అవ్వాలనుకున్న జనసేన పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో జనసైనికులు కాస్త నిరాశతో ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో అయినా నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అనుకుంటున్నారు.
నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan).. తెలంగాణలోనూ తమ పార్టీకి ఓటు బ్యాంక్ ఉందని గతంలో చెప్పారు. తెలంగాణలో కమిటీలు కూడా వేశారు. ఒంటరి పోరుకు సిద్ధమన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు. కానీ ఫలితాల్లో మాత్రం పవన్ కల్యాణ్ మాటలు కనిపించడం లేదు. దీంతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అయిందని ట్రోలింగ్ నడుస్తోంది.