Palakurthy News : కాంగ్రెస్ అభ్యర్థి నోట ‘జై కేసీఆర్’ నినాదం-కంగుతిన్న పార్టీ శ్రేణులు
Palakurthy News : పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పొరపాటున జై కేసీఆర్ అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Palakurthy News : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి దయాకర్ రావుపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి 'జై కేసీఆర్' అంటూ నినాదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక్కసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరున నినాదాలు చేయడంతో అక్కడున్న కాంగ్రెస్ నేతలంతా కంగుతిన్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరగగా.. కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ నినదిస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్రెండింగ్ వార్తలు
దయాకర్ రావు వర్సెస్ యశస్వినీ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్వినీ రెడ్డి మంత్రి దయాకర్ రావుపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి కోడలిగా బరిలో దిగిన ఆమె.. రాజకీయ ఉద్ధండుడిగా పేరున్న మంత్రి దయాకర్ రావుపై పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం అందరిలో ఆసక్తిని పెంచింది. అంతేగాకుండా 67 ఏళ్ల మంత్రి దయాకర్ రావుపై పోటీ చేస్తున్న యశస్వినీ రెడ్డి వయసు 26 ఏండ్లు మాత్రమే కావడం కూడా అందరి దృష్టిని పాలకుర్తి నియోజకవర్గం ఆకర్షించడానికి కారణమైంది. మంత్రి దయాకర్ రావు, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కుటుంబాల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉండగా.. ఆమె కుటుంబం నుంచి యశస్వినీరెడ్డి మంత్రిపై పోటీకి బరిలో నిలవడంతో ఇక్కడ ఏం పరిణామాలు జరిగినా నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అవాక్కైన కాంగ్రెస్ నేతలు
మంగళవారం ఉదయం పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి అధికార పార్టీ నేతలను విమర్శించడంతో పాటు అభివృద్ధి ఏం జరగలేదంటూ కామెంట్స్ చేశారు. అనంతరం తన ప్రసంగాన్ని ముగిస్తున్న క్రమంలో ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నేతలు షాక్ అయ్యారు. ఆమె మీటింగ్ కు హాజరైన జనాలు కూడా ఒక్కసారిగా అవాక్కై గోల చేశారు. వెంటనే అలర్ట్ అయిన యశస్విని రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నినాదాలు అందుకున్నారు. కాగా కీలకంగా భావిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ నినాదాలు చేయడం పట్ల నియోజకవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. పాలకుర్తిలో మంత్రి దయాకర్ రావు గెలుపు ఖాయమని, అదే విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి కూడా చెబుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, వరంగల్