Nalgonda Election Results 2023 : నల్గొండలో హస్తం హవా, 11 చోట్ల ఘన విజయం
Nalgonda Election Results 2023 : నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 12 నియోజకవర్గాలకు 11 చోట్ల ఘన విజయం సాధించింది.
Nalgonda Election Results 2023 : తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాపై తన ముద్ర వేసింది. ఈ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కేవలం ఒకే ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (సూర్యాపేట) తక్కువ మెజారిటీతో గెలిచారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ వైపు ఏక పక్షంగా నిలబడినట్లు అయ్యింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో చెరో 6 చోట్ల విజయం సాధించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ (5, సీపీఐ 1) సమ ఉజ్జీలుగా నిలిచాయి. 2018 ఎన్నికల విషయానికి వచ్చే సరికి మాత్రం బీఆర్ఎస్ ఏకంగా 9 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ, 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించారు. 12 నియోజకవర్గాలకు గాను 11 చోట్ల విజయాలు సొంతం చేసుకున్నారు.
11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.. ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో గెలవగా.. ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఎన్నిక ఏక పక్షంగా సాగింది. కాగా, సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలిచారు. ఇక్కడి ఎన్నిక కొంత ఆసక్తిరేపింది. చతుర్ముఖ పోటీలో తక్కువ ఓట్ల మెజారిటీతో మంత్రి బయట పడ్డారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గణనీయంగా ఓట్లు ( 40407) చీల్చుకోవడం బీఆర్ఎస్ కు కలిసొచ్చింది. బీఎస్సీ అభ్యర్థి కూడా చెప్పుకోదగిని రీతిలో ఓట్లు (13,907) చీల్చడం కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి రావాల్సినన్ని ఓట్లు రాక, బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి 4606 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాగా, నకిరేకల్ లో కాంగ్రెస్ కు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి, ఈ ఎన్నికల విజేత వేముల వీరేశానికి 68,839 ఓట్ల మెజారిటీ వచ్చింది.
విజేతలు వీరే
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య యాదవ్ విజయం సాధించగా ఆయన చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత ఓటమి పాలయ్యారు. భువనగిరిలో కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిపై గెలిచారు. మునుగోడులో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు. దేవరకొండలో కాంగ్రెస్ నుంచి బాలూనాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్ పై గెలిచారు. నాగార్జున సాగర్ కాంగ్రెస్ కు చెందిన కుందూరు జైవీర్ రెడ్డి , బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పై గెలుపొందారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్.భాస్కర్ రావుపై గెలిచారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవగా ఆయన చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓడిపోయారు. కోదాడలో కాంగ్రెస్ నుంచి ఎన్.ఉత్తమ్ పద్మావతి విజయం సాధించగా ఆమె చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఓటమిపాలయ్యారు.
తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి మందుల సామేలు, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ పై గెలిచారు. నకిరేకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పై విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి విజయం సాధించగా, ఆయన చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక, సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి జి.జగదీష్ రెడ్డి గెలవగా, ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.దామోదర్ రెడ్డి ఓడిపోయారు. మొత్తం పన్నెండు నియోజకవర్గాలకు గాను 11 చోట్ల కాంగ్రెస్, ఒక చోట బీఆర్ఎస్ గెలుపొందాయి.
విజేతల ఓట్ల వివరాలు
నియోజకవర్గం -కాంగ్రెస్ (ఓట్లు)- బీఆర్ఎస్ (ఓట్లు) -విజేత -మెజారిటీ
- ఆలేరు --122140 --72505- -కాంగ్రెస్ --49636
- భువనగిరి- -102742-- 76541-- కాంగ్రెస్-- 26201
- దేవరకొండ --111344 --81323-- కాంగ్రెస్-- 30021
- హుజూర్ నగర్ --116707-- 71819 --కాంగ్రెస్-- 44888
- కోదాడ-- 125783 --67611 --కాంగ్రెస్-- 58172
- మిర్యాలగూడ-- 114462-- 65680-- కాంగ్రెస్-- 48782
- మునుగోడు-- 119624-- 79034 --కాంగ్రెస్ --40590
- నాగార్జున సాగర్ --119831 --63982 --కాంగ్రెస్-- 55849
- నకిరేకల్-- 133540 --64701-- కాంగ్రెస్-- 68839
- నల్గొండ--107405-- 53073 --కాంగ్రెస్-- 54332
- తుంగతుర్తి-- 129535-- 78441-- కాంగ్రెస్-- 51094
- సూర్యాపేట --70537-- 75143-- బీఆర్ఎస్-- 4606
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )