Malla Reddy On CBN : చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు... బంగారం లాంటి మనిషి - మంత్రి మల్లారెడ్డి-minister malla reddy comments about chandrababu arrest ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Minister Malla Reddy Comments About Chandrababu Arrest

Malla Reddy On CBN : చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు... బంగారం లాంటి మనిషి - మంత్రి మల్లారెడ్డి

HT Telugu Desk HT Telugu
Nov 17, 2023 11:21 AM IST

Minister Malla Reddy On CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు బంగారం లాంటి మనిషి అని…. ఆయన ఆరెస్ట్ అయితే ఏడ్చానని చెప్పుకొచ్చారు.

మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

Minister Malla Reddy News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ బిఆర్ఎస్ నేతలు అయన అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మరోసారి బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి స్పందించారు.గురువారం ఓ టీవి ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బంగారం లాంటి మనిషి అని… బాబు అరెస్ట్ అయినప్పుడు తాను ఏడ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాళా తీసిందని మల్లారెడ్డి ఆరోపించారు.తాను టీడీపీలోనే కొనసాగుదాం అనుకున్నా పరిస్థితుల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణ లో తానొక్కడే టీడీపీ నుంచి గెలిచారని మల్లారెడ్డి గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ అభివృద్ధి లో దూసుకెళుతోంది అని వివరించారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలను సీఎం కేసిఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. ఆంధ్ర సెటెర్లు ఎవ్వరూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని స్పష్టం చేశారు.

నాకు ఇవే చివరి ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు.తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఇకపై పోటీ చేయనని వెల్లడించారు.మల్లారెడ్డి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ....తన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. 2014 లో టిడిపి పార్టీ ద్వారా తాను రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి అదే సంవత్సరం ఎంపిగా గెలిచారని గుర్తు చేశారు.పరిస్థితుల కారణంగా 2016 లో అప్పటి తెరాస పార్టీలో చేరాల్సి వచ్చిందని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు కేసిఆర్ కార్మిక శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారాని అయన వివరించారు. తనకు ఇద్దరూ కుమారులు,కోడళ్ళు,మనవరాళ్లు,మనవాళ్ళు ఉన్నారని తన వయసు ఇప్పటికే 70 దాటిందని అందుకే ఇవే తనకు చివరి ఎన్నికలు అని మల్లారెడ్డి వెల్లడించారు.

నాకు 800 ఎకరాల భూమి ఉంది

తనకు ఇప్పటికే చాలా ఆస్తులు,కావల్సినంత బ్యాంక్ బ్యాలన్స్,సుమారు 800 ఎకరాల భూమి ఉన్నాయని మల్లారెడ్డి తెలిపారు.తాను జీవితంలో సాధించాల్సింది ఇంకేం లేదన్న మంత్రి తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ఖండించారు.తాను గుంట భూమి కూడా ఎవరిది కబ్జా చేయలేదన్నారు. గజం స్థలానికి కూడా అన్నీ డాక్యుమెంట్లు పకడ్బందీగా ఉన్నాయన్నారు.కొందరు కావాలనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel