Bhatti Vikramarka : కాంగ్రెస్ కు 20 సీట్లే వస్తే కేసీఆర్ ఎందుకు కాకిలా తిరుగుతున్నారు- భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : మధిరలో వంద మంది కేసీఆర్ లు వచ్చి మీటింగ్ పెట్టినా నన్ను ఏం కదల్చలేరని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లే వస్తే కేసీఆర్ ఎందుకు రాష్ట్రమంతా తిరుగుతున్నారో అని ప్రశ్నించారు.
Bhatti Vikramarka : "కేసీఆర్ అనే బండరాయిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు రత్నం అనుకుని పదేళ్లు నెత్తిన పెట్టుకొని మోశారు.. ఇక బండరాయిని బండకేసి బాధే సమయం ఆసన్నమైంది.." అని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం బాణాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్న ప్రజలు బండకేసి బాధడానికి రెడీ అవుతున్నారన్నారు. "కేసీఆర్ నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, బిడ్డ కలిసివచ్చినా ఖమ్మం జిల్లాలో నన్నేమి చేయలేరు" అని భట్టి పేర్కొన్నారు. మధిరలో వంద మంది కేసీఆర్ లు వచ్చి మీటింగ్ పెట్టినా నన్ను ఏమీ కదల్చలేరని వ్యాఖ్యానించారు. మధిర ప్రజల అభిమానాన్ని డబ్బులతో కొనలేరని హితవు పలికారు. గతంలోనూ తనను ఓడించాలని కేసీఆర్ ఇలాగే తీవ్రంగా ప్రయత్నించి ప్రయాస పడ్డారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తిని గెలిపించాలని మధిర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 సీట్లే వస్తాయని కేసీఆర్ భావిస్తే కాకిలా ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని అపహాస్యం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
గజ్వేల్ లో గెలవలేకే కామారెడ్డిలో పోటీ
గజ్వేల్లో గెలవలేకే కామారెడ్డి వెళ్లిన కేసీఆర్ కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. కేసీఆర్ కే దిక్కులేదు గానీ కేసీఆర్ పెట్టిన అభ్యర్థి మధిరలో ఏం గెలుస్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 75 స్థానాలకు పైగా స్థానాల్లో విజయం సాధించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, భూ పంపిణీ, హరిత విప్లవం, శ్వేత విప్లవం అని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఇందిరమ్మ 20 సూత్రాలు తీసుకొచ్చారని, ఆమెను విమర్శించే నైతికత కేసీఆర్ కు లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వద్దని రాష్ట్రాన్ని ఫ్యూడలిస్టుల రాజ్యంలోకి తీసుకెళ్లాలని కేసీఆర్ కంటున్న కలలు పటాపంచలవుతాయని పేర్కొన్నారు. భట్టి విక్రమార్కకు భయపడే ముఖ్యమంత్రి మధిరకు దళిత బంధు ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను లెక్కలతో సహా అసెంబ్లీలో నిలదీయడంతో దళిత బంధు తెరపైకి తెచ్చారని వివరించారు.
విద్యుత్ ఉత్పత్తికి కేసీఆర్ చేసిందేమిటీ?
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మాణం చేసిన పవర్ ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు కరెంటు కొరత లేకుండా విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ రాష్ట్రానికి నాలుగు శాతం ఎక్కువగా కరెంటు కేటాయించిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం