TS Liquor Shops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్- స్టాక్ కోసం నేతల ప్రయత్నాలు!
TS Liquor Shops : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో నేతలు ముందుగానే స్టాక్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
TS Liquor Shops : మందుబాబులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. గత ఉపఎన్నికల్లో మద్యం ఏరులై పారిన నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం సరఫరాను తగ్గించడానికి ఎన్నికలకు రెండు రోజుల ముందు నుండే వైన్స్ షాపులను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో రాజకీయ ప్రచారాలు ఊపందుకున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతుండగా 28,29,30వ తేదీల్లో వైన్స్ షాపులు పూర్తిగా మూసివేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ప్రచారాలకు వెళ్లిన వారికి రాత్రి పగలు తేడా లేకుండా, ఆయా రాజకీయ పార్టీలు మద్యం, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేస్తూ తమ జనబలాన్ని ప్రజల్లో ప్రదర్శిస్తున్నారు నేతలు.
రికార్డు స్థాయిలో అమ్మకాలు
మూడు రోజుల పాటు దుకాణాల బంద్ నేపథ్యంలో అందినంత వరకు స్టాక్ ను తమ అనుచరుల ఇండ్లల్లో దాచి ఉంచడానికి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. లైసెన్స్ దారులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో...రాజకీయ పార్టీ నాయకులకు సహకరించడానికి వైన్స్ షాపుల యజమానులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని ఆలోచించిన మద్యం వ్యాపారులు...ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ ను తమ దుకాణాల్లో నిల్వ ఉంచినప్పటికీ ,ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లల్లో ఉంచితే ఏ పార్టీ వాళ్లు ఎక్కడ ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తే తమ స్టాక్ సీజ్ అవుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తమ పరిస్థితి ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్: గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా