Bandi Sanjay : ప్రజల కోసం కొట్లాడితే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు- బండి సంజయ్
Bandi Sanjay : మెడికల్ కాలేజీ కోసం అప్లై చేయని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తుందని బండి సంజయ్ మండిపడ్డారు. దరఖాస్తు చేసుకున్న అన్ని రాష్ట్రాలకు కేంద్రం మెడికల్ కాలేజీలు ఇచ్చిందన్నారు.
Bandi Sanjay : మెడికల్ కాలేజీల కోసం అప్లై కూడా చేయని సీఎం కేసీఆర్ కు కేంద్రం ఇవ్వలేదని మాట్లాడే అర్హత లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు. దేశానికి 157 కాలేజీలు ఇచ్చిన ప్రధాని మోదీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకివ్వలేదని కేసీఆర్, కరీంనగర్ సభలో అడగడం సిగ్గు చేటని అన్నారు. మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి దరఖాస్తు కూడా పంపించని కేసీఆర్ వాటి గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదన్నారు. దరఖాస్తు చేసుకోకుండా విద్యార్థులను పరీక్షలకే హాజరు కానివ్వమని, అలాంటిది మెడికల్ కాలేజీలకు అప్లై కూడా చేసుకోకుండా కేసీఆర్ వాటి గురించి మాట్లాడడం నిరర్ధకమన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్నాయని, ఆయా రాష్ట్రాలన్నింటికీ కాలేజీలు మంజూరయ్యాయన్నారు. బీజేపీని నిత్యం తిట్టే పాలక పార్టీలున్న తమిళనాడుకు 11, బెంగాల్ కు 7 మెడికల్ కాలేజీలు మంజూరైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అప్లై చేయలేదు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న బండి మాట్లాడుతూ.. కేసీఆర్, గంగుల కమలాకర్ చేసిన ప్రసంగాలపై కౌంటర్ ఇచ్చారు. కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోమ్మని కేంద్రం చెప్పినప్పుడు, ఈ పిట్టల దొర ప్రభుత్వం దరఖాస్తులు పంపలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు దశల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందన్నారు. మూడో దశలో దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కాలేజీల కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అన్ని రాష్ట్రాలకు కాలేజీలు మంజూరయ్యాయన్నారు. నిత్యం మోదీని తిట్టే పశ్చిమ బెంగాల్‌కు 7 కాలేజీలు... బీజేపీ అధికారంలో లేని తమిళనాడుకు 11 వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు కూడా ఇస్తాం డీపీఆర్‌లు (డీటైల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) పంపండని కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర సర్కార్ పంపలేదన్నారు.
దమ్ముంటే చర్చకు రావాలి
కేసీఆర్ కరీంనగర్ సభలో వినోద్ రావు గురించి పలుసార్లు పొగడ్తలు చేస్తూ మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకరా లేక వినోద్ రావా? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైందన్నారు. వినోద్ రావు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చినట్లు చెబుతున్నారని, స్మార్ట్ సిటీ నిధులిచ్చింది కేంద్రమేననే విషయం కేసీఆర్ కు సోయి లేకుండా మాట్లడాడం సిగ్గుచేటన్నారు. పది ఏళ్లుగా కేసీఆర్ పట్టించుకోకపోతే తాను చొరవ తీసుకుని ఆ నిధులను తీసుకొచ్చానన్నారు. తెచ్చిన నిధులను దారి మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు. కరీంనగర్.. వరంగల్, కరీంనగర్...జగిత్యాలతోపాటు తీగలగుట్టపల్లి ఆర్వోబీ, రైల్వే లైన్ నిధులన్నీ తానే తీసుకొచ్చానన్నారు. కొబ్బరికాయ కొట్టి ఫోజులు కొట్టింది మాత్రం బీఆర్ ఎస్ నాయకులని..దమ్ముంటే ఈ నిధులపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
పేదల పక్షాన పోరాటం
కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థికి భూకబ్జాలు తప్ప ఏం తెలియదని, కరీంనగర్ పైన అవగాహనే లేదన్నారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా అని అభ్యర్థులపై మండిపడ్డారు. తాను నిరంతరం ప్రజల కోసం పోరాడానని, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలుసహా అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడి జైలుకు వెళ్లానని చెప్పారు. తాను ప్రజల కోసం కొట్లాడితే... తనకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులని అన్నారు. ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కకుపెట్టి పోరాడానని, ఏనాడూ భార్యాపిల్లలకు పూర్తి సమయం కేటాయించలేదని చెప్పారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడేవారిని గెలిపించకపోతే... ఇకపై పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేసే ప్రమాదముందని హెచ్చరించారు.
రిపోర్టర్: గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా