Karimnagar Election Fight : ఓటుకు రూ.20 వేలు ఇద్దామని వస్తుండు.. బండి సంజయ్ పై గంగుల ఆరోపణలు
Telangana Assembly Elections 2023: బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. ఓటుకు రూ. 20 వేలు ఇవ్వటానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు. సంజయ్ ఇచ్చిన డబ్బులను తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పిలపునిచ్చారు.
karimnagar Assembly Constituency : ఎంపీగా బండి సంజయ్ అందరినీ దోచుకొని కోట్లరూపాయలు సంపాదించాడని ఆరోపించారు మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. ఓటుకు ఇరవై వేలు ఇద్దామని సిద్దమయ్యాడని...ఆయన ఇచ్చే డబ్బు ప్రజలదేనని వాటిని తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని ధుబ్బపల్లి, ఫకీర్ పేట, జూబ్లీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామస్థులు గంగులకు డప్పు చప్పుళ్లతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంపీగా గెలిచి నాలుగేళ్లలో బండి సంజయ్ ఒక్క గ్రామానికి వచ్చింది లేదని… మళ్ళీ ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పేందుకు వస్తున్నాడన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని… వాళ్లకు ఓట్లు వేయించుకొని మాయం అవడం తప్ప తెలిసిందేమీ లేదన్నారు. తాను ఎల్లప్పుడూ మీ కళ్ళ ముందే మీ ఆపదలో అండగా ఉన్నానని గుర్తు చేశారు. బీజేపీ కాంగ్రెస్ లు మోసగాళ్ళ పార్టీలని.. యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మన బతుకులు చీకటిమయం చేశాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ రహదారులన్నీ పూర్తి చేసి గ్రామాల రూపురేఖలు మార్చామన్నారు. అన్నదాతలను అష్టకష్టాలు పెట్టి ఆత్మహత్యలకు కారణం అయిన పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మితే మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు.జనవరి నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు, పించన్లు అందేజేస్తామని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై ఆయన చేసిన అభివృద్ధి పై గ్రామాల్లో చర్చించాలని.. మన ఇంటి పార్టీ అయిన బీ ఆర్ ఎస్ కు ఓటు వేసి కెసిఆర్ చేతులను బలోపేతం చేయాలని కోరారు. ఎన్నికలప్పుడే కనబడే బండి సంజయ్ అందరిని దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించాడని.., ఓటుకు ఎంత అంటే ఇంత ఇవ్వడానికి సిద్దమయ్యాడని,సుమారు ఇరవైవేల రూపాయలు ఇవ్వడానికి సిద్దమైనట్టుగా తెలుస్తోందన్నారు. డబ్బులు ఆయన దగ్గర తీసుకుని ఓటు మాత్రం ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ కే వేయాలని పిలుపునిచ్చారు.