Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం-జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం అభ్యర్థి వరకు రేవంత్ రెడ్డి ప్రస్థానం-hyderabad news in telugu revanth reddy key on congress victory in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం-జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం అభ్యర్థి వరకు రేవంత్ రెడ్డి ప్రస్థానం

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం-జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం అభ్యర్థి వరకు రేవంత్ రెడ్డి ప్రస్థానం

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2023 04:29 PM IST

Revanth Reddy : జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి స్థాయికి చేరుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెబుతూ హస్తం పార్టీకి అధికారం సాధించే స్థాయికి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి... సుదీర్ఘ కాలంగా పాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి...సీనియర్లను సమన్వయం చేసుకుంటూ... ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ శాసనసభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2009-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, 2014-2018 మధ్య తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి కొడంగల్(Kodangal) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కొడంగల్ నియోజకవర్గానికి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. జూన్ 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(TPCC President)గా నియమితులయ్యారు.

కుటుంబ నేపథ్యం

అనుముల రేవంత్ రెడ్డి..1969 ఆగస్టు 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లెలో దివంగత నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్ రెడ్డి... ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్(Hyderabad) వచ్చారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్... పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో మెంబర్ గా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అది విజయవంతం అవ్వడంతో...రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ రెడ్డి.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

రేవంత్ రాజకీయ ప్రస్థానం

టీడీపీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు రేవంత్ రెడ్డి. 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా.. కూటమి పొత్తు్ల్లో భాగంగా ఆ సీటు రేవంత్ కు రాలేదు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో టీఆర్ఎస్(TRS) నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి...2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అప్పుడే రేవంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్ గా పనిచేసిన రేవంత్ రెడ్డికి చంద్రబాబు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనా.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి... కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తరపున రేవంత్ బలంగా గొంతు వినిపించేవారు. రేవంత్ రెడ్డి 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్‌ రెడ్డి 2014-17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. అనంతరం 2017 అక్టోబర్‌లో టీడీపీ(TDP) రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ రెడ్డి 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 26 జూన్ 2021లో రేవంత్ రెడ్డిని జాతీయ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.

మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ

  • 2006- స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి, మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి ZPTC సభ్యుడు
  • 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి 46.45 శాతం ఓట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు . కాంగ్రెస్ అభ్యర్థి, ఐదుసార్లు ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిపై గెలిచారు.
  • 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 14,614 ఓట్ల మెజారిటీతో గెలిచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
  • 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల తేడాతో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
  • 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసి విజయం సాధించారు.

కాంగ్రెస్ లో కీలకంగా

టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. అయితే తెలంగాణ(Telangana)లో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఓటమిపాలైయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిటెండ్ గా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల తేడాతో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

WhatsApp channel