Amit Shah : బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చింది-అమిత్ షా
Amit Shah : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా గద్వాల సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ను వీఆర్ఎస్ పంపించే టైం వచ్చిందని అమిత్ షా విమర్శలు చేశారు.

Amit Shah : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనం ఉచితంగా కల్పిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేసిన అమిత్ షా... బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని, ఆలయ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ. 70 కోట్లు ఇస్తే వాటిని కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిపిస్తే బీసీ వ్యక్తిని సీఎంని చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ బీసీలకు టికెట్లు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేశారన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఇంకా ఎందుకు పూర్తికాలేదు?
బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్ ను ఎందుకు నిర్మించలేదని అమిత్ షా ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్నారు . గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్న కేసీఆర్... ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గద్వాలలో చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్ వీవర్స్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారని, అది కూడా ఏర్పాటు చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అమిత్ షా ధ్వజమెత్తారు.
కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం ఒవైసీ చేతిలోనే ఉందని అమిత్ షా మరోసారి విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో తెలంగాణ యువత జీవితాలతో ఆడుకున్నారన్నారు. బీజేపీకి అధికారమిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించేవాన్నారు. బీసీ నేత సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నారు. ఈ రెండూ పార్టీలు బీసీలకు అన్యాయం చేశారని, అనుకున్నంత స్థాయిలో టికెట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.