Telangana Elections 2023 : నిలబడి.... పోరాడి - ఇచ్చిన తెలంగాణలో ఎగిరిన 'హస్తం' జెండా-for the first time congress party won in telangana after state formation ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  For The First Time Congress Party Won In Telangana After State Formation

Telangana Elections 2023 : నిలబడి.... పోరాడి - ఇచ్చిన తెలంగాణలో ఎగిరిన 'హస్తం' జెండా

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 03, 2023 03:30 PM IST

Telangana Election Results 2023 : 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది నాటి యూపీఏ ప్రభుత్వం. అయితే ప్రజల ఆకాంక్షల దృష్ట్యా… రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ హస్తం పార్టీని ఆదరించలేదు ఇక్కడి ప్రజలు. తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ నే గెలిపించాలి. కానీ ఈసారి ఇచ్చిన కాంగ్రెస్ వెంటే నడిచారు

తెలంగాణలో కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ విజయం

Telangana Election Results 2023 : తెలంగాణ గడ్డపై తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. 2014లో రాష్ట్ర ఏర్పడగా… రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఇక్కడి ప్రజలు. కానీ ఈసారి మాత్రం… తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పీఠాన్ని అప్పగించారు. ఈ మధ్య కాలంలో…. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడింది. అధికార పార్టీతో తలపడి, పోరాడి విజయాన్ని అందుకోగలిగింది.

ట్రెండింగ్ వార్తలు

2014లో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన

2009లో మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం బాగా బలపడింది. దాదాపు నాలుగేళ్లపాటు మహాత్తర పోరాటం సాగింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోని యూపీఏ సర్కార్… రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. 2014లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో యూపీఏ సర్కార్ ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఇక తెలంగాణలోనైనా జెండా ఎగరుతుందేమో అని భావించారు. కానీ పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ కే పట్టం కట్టారు ప్రజలు. దీంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆరే ప్రమాణస్వీకారం చేశారు.

ఇక 2018 ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ గెలుస్తుందేమోనని అంతా భావించారు. కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సూపర్ విక్టరీని అందుకుంది. ఏకంగా 88 స్థానాల్లో గెలిచి తిరుగులేని శక్తిగా మారింది. అప్పటికే ఓసారి ఓడిపోయిన కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కానీ 2018 ఎన్నికల్లోనూ ఓడిపోవటంతో… మరింత కష్టాలు వచ్చాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు… కారు ఎక్కేశారు. అంతేకాకుండా… చాలా మంది నేతలు పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు.

వీటన్నింటి నేపథ్యంలో… పార్టీలోని నేతల మధ్య సఖ్యత లేకపోవటం కూడా కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. కానీ రేవంత్ రెడ్డి పార్టీలో చేరటం.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి నెమ్మదిగా మారుతూ వచ్చింది. ప్రభుత్వంపై పోరాడే విషయంలో… కీలక కార్యక్రమాలను తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అసెంబ్లీలో బలం లేకున్నా.. ఉన్న సభ్యులతో రాణించారు.

ఇక ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని భావించిన కాంగ్రెస్ గత ఏడాది కాలంగా తెలంగాణపై దృష్టిపెట్టింది. నేతల మధ్య విభేదాలు లేకుండా కలిసి నడవాలని తేల్చి చెప్పింది. అగ్రనేత రాహుల్ చేపట్టిన జోడో యాత్రతో పార్టీలో మంచి జోష్ ను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత నిరుద్యోగుల తరపున గట్టిగా పోరాడటమే కాకుండా… వారిలో భరోసాను నింపే ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రకటన రావటంతో… అభ్యర్థుల ఎంపిక నాటి నుంచి… పోలింగ్ వరకు కూడా ఏ చిన్న ఛాన్స్ ను కూడా వదులుకోకుండా పని చేసింది కాంగ్రెస్. వీటన్నింటి ఫలితమే నేటి విజయంగా మారింది.

WhatsApp channel