KCR Campaign : కొట్లాటలు తప్ప చేసిందేం లేదు... బండి సంజయ్ ని టార్గెట్ చేసిన కేసీఆర్
Telangana Assembly Election 2023: కరీంనగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన ఆయన…. మత రాజకీయాలు చేసే బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు.

Telangana Assembly Election 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం ఒకే రోజు నాలుగు సభలకు హాజరైన ఆయన… ఇవాళ కూడా నాలుగు సభలు ఉన్నాయి. ఇందులో భాగంగా తొలుత కరీంనగర్ ప్రజాశీర్వాద సభకు హాజరయ్యారు కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. బీఆర్ఎస్ విజయంపై ఎలాంటి సందేహాం అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా మనవైపే ఉన్నారని… ఎవరు ఏం అన్నా పట్టించుకోవద్దని కామెంట్స్ చేశారు. మరోవైపు బండి సంజయ్ పేరు ఎత్తకుండానే కరీంనగర్ ఎంపీ అంటూ ఫైర్ అయ్యారు.
కరీంనగర్ లో కేసీఆర్ ప్రసంగం :
-కరీంనగర్ ఎంతో చైతన్యవంతమైన గడ్డ. మొట్టమొదటి టీఆర్ఎస్ సింహ గర్జన కూడా ఇక్కడే పెట్టాను. తెలంగాణ తీసుకొని రాకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పా. తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే నాటి సభ అతిపెద్ద ఘట్టం.
- బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను కరీంనగర్ గడ్డ నుంచే ప్రకటించుకున్నాం.
-కరీంనగర్ మట్టికి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీనే దోఖా బాజీ పార్టీ. 58 ఏళ్లుగా మనల్ని ఏడ్పించిన పార్టీ కాంగ్రెస్. విద్యార్థి అమరవీరులకు కారణం కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని కూడా మోసం చేసింది.
-14ఏళ్ల కొట్లాడితే తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నాలు కూడా చేశారు. నేను దీక్షకు శ్రీకారం చుట్టింది కూడా కరీంనగర్ నుంచే. ఉద్యమ ఘట్టాల్లో తొలి స్థానాల్లో ఉండేది కరీంనగర్.
-తలసరి ఆదాయంలో ఇవాళ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఓవైపు ఆదాయాన్ని పెంచుతూనే ప్రజలకు మంచి చేస్తున్నాం. ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నాం.
-తలసరి విద్యుత్ వినియోగంలో మన ర్యాంక్ ఎక్కడో ఉండేది. కానీ ఇవాళ మనం అగ్రస్థానంలో ఉన్నాం.
-ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులు ఉంటారు. కేవలం అభ్యర్థి గుణగనాలు మాత్రమే చూడకుండా… ఆ అభ్యర్థి వెనక ఉన్న పార్టీ విధానమేంటి..? ప్రజల పట్ల వారి దృక్పథం ఏంటనేది చూడాలి…?
-ఓటు అనేది వజ్రాయుధం. ఆ ఓటు అనేది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే అషామాషీగా తీసుకొని ఓటు వేయవద్దు. మన గురించి మంచి ఆలోచించే పార్టీకే ఓటేయ్యాలి.
- బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఎంటో మీకు తెలుసు.తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా తెలుసు. వారి కాలంలో ఏం జరిగిందో… మన పాలనలో ఏం జరిగిందో మీ కళ్ల ముందే కనిపిస్తుంది.
-కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు, ఆత్మహత్యలు, వలసలు మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు.
- రాష్ట్రంలో మళ్లీ మనమే వస్తున్నాం. నవంబరు 30న చూస్తారు ఎలా ఉంటుందో. అంతా మనవైపే ఉన్నారు. ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవద్దు.
- బీజేపీ సర్కార్ ఒక్క మెడకల్ కాలేజీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలల విషయంలో చట్టం ఉన్నప్పటికీ... మన తెలంగాణకు కేటాయించలేదు. కేవలం బీజేపీ వాళ్లకు మత పిచ్చి తప్ప మరోకటి లేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి...?
- వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉండేది..? ఇప్పుడు ఉన్న ఎంపీ పద్ధతి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడున్న ఎంపీది ఏం లేదు… చేసిందేమీ కూడా లేదు. ఏమైనా ఉంటే మసీదులు తవ్వాలని అంటున్నారు. హిందూ మతం పేరు చెప్పి కొట్లాటలు పెట్టడమే తెలుసు. ఇలాంటి వాళ్లా మనకు కావాల్సింది...?
-బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించిన పరిస్థితి లేదనే విషయాన్ని గమనించాలి.
-ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ను మంచి మెజార్టీతో మరోసారి గెలిపించుకోవాలి. కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుంది.