Telangana Election Results 2023 : ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ దెబ్బ, భారీగా ఓట్ల చీల్చిన కమలం అభ్యర్థులు
Telangana Election Results 2023 : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ లో బీజేపీ పలు చోట్ల ముందంజలో ఉంది.
Telangana Election Results 2023 : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. తాజాగా అందిన సమాచారం మేరకు 119 నియోజకవర్గంలో బీఆర్ఎస్ 36 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 68 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం నాలుగు స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.... బీజేపీ భారీగా ఓట్లను చీల్చింది. ఉత్తర తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఆధిక్యంపై బీజేపీ ప్రభావంతో తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ ఇంకా మెరుగైన స్థితిలో ఉండే అవకాశాన్ని బీజేపీ దెబ్బతీసిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ విజయవకాశాలను దెబ్బతీసింది.
ఓట్లు చీలుస్తున్న బీజేపీ
తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. దీంతో పాటు బీజేపీ 10 సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ గుప్త ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వెనకంజలో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ వెనకంజలో ఉండగా, కరీంనగర్ లో బండి సంజయ్, గంగుల కమలాకర్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థులు పలు చోట్ల భారీగా ఓట్లను చీల్చారు.
10 స్థానాల్లో బీజేపీ ముందంజ
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ అభ్యర్థులు మేరుగైన ఓట్లు సాధించారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు ఉత్తర తెలంగాణలో బీజేపీకి కలిసి వచ్చాయి. ప్రస్తుత ఫలితాలు కొనసాగితే తెలంగాణలో బీజేపీ 10 సీట్లు గెలుచుకొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని బీజేపీ చీల్చిందని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లోని 10 స్థానాల్లో బీజేపీ 4 స్థానాలు, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ లో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 4, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.
బీజేపీ ముందంజలో ఉన్న స్థానాలు : సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, ఆర్మూర్, నిజామాబాద్ (అర్బన్), మహేశ్వరం, కార్వాన్, చార్మినార్ , బహదూర్‌పురా