Siddipet Majority: సిద్ధిపేటలో తగ్గిన హరీష్ రావు మెజారిటీ
Siddipet Majority: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలంటే, సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి టి హరీష్ రావుకు ఎంత ఆధిక్యం వస్తది అనేదాని పైన ప్రజలు అందరు మాట్లాడుకుంటుంటారు. ఈ సారి మాత్రం భారీ తగ్గుదల నమోదైంది.

Siddipet Majority: తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య ఓటమి మూటగట్టుకున్న బిఆర్‌ఎస్ పార్టీలో మరికొన్ని విశేషాలు కూడా జరిగాయి. మంత్రి హరీష్ రావు మెజార్టీ కూడా భారీగా తగ్గింది.
ప్రతి ఎన్నికల్లోనూ హరీష్ రావు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కంటే అతనే ఎక్కువ మెజారిటీ సాధించి వార్తల్లో నిలిచాడు. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో, 1 లక్ష 18 వేల ఆధిక్యం పైగా సాధించి తన ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసాడు. ఈ సారి ఎన్నికల్లో కూడా హరీష్ రావు రాష్ట్రంలో రెండో ఎక్కువ మెజారిటీ సాధించాడు.
అయితే ఈ సారి రాష్ట్రం మొత్తం, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో, మాజీ మంత్రికి మెజారిటీ 36వేల ఓట్లకు పైగా తగ్గింది. హరీష్ రావుకు 2023 ఎన్నికల్లో 82 వేల ఓట్ల పై చీలుకు ఆధిక్యం మాత్రమే వచ్చింది. గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యం కంటే 36 వేలు ఓట్లు తక్కువ నమోదయ్యాయి.
గత ఎన్నికల్లో 78.50 శాతం ఓట్లు వస్తే, ఈ సారి 58 శాతం ఓట్లు మాత్రమే హరీష్ రావుకు వచ్చాయి.… సిద్దిపేట నుండి రికార్డు స్థాయిలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిసిన హరీష్ రావుకు గత ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 78.50 శాతం దక్కించుకున్నాడు. ఈ సారి మాత్రం తనకు, మొత్తం పోలైన ఓట్లలో 58 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
గత ఎన్నికలతో పోలిస్తే సుమారుగా 20 శాతం ఓట్లు తగ్గిపోయాయి. తన ప్రత్యర్థులందరికి కలపి 48 శాతం ఓట్లు వచ్చాయి. 2008 ఉప ఎన్నిక తరువాత, హరీష్ రావు వ్యతిరేకంగా ఇన్ని ఓట్లు ఎప్పుడు పోల్ కాలేదు.
2010 ఎన్నికల నుండి, జరిగిన నాలుగు ఎన్నికల్లో హరీష్ రావు పొందిన అత్యల్ప మెజారిటీ 2023 ఎన్నికల్లో వచ్చిందే. హరీష్ రావు, 2004 ఉప ఎన్నికల్లో సిద్ధిపేట నుండి మొట్టమొదటి సారి పోటీచేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 24 వేల ఓట్ల మెజారిటీతో గెలిసాడు.
2008 ఉప ఎన్నికల్లో, తన ఆధిక్యాన్ని 58 వేలకు, 2009 సాధారణ ఎన్నికల్లో అది 64 వేలకు పెంచుకున్నాడు. 2010 ఉప ఉన్నికల్లో తాను 93 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 2014 సాధారణ ఎన్నికల్లో 95 వేల ఓట్లకు తన ఆధిక్యాన్ని పెంచుకొని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత జరిగిన 2018 సాధారణ ఎన్నికల్లో, తన ఆధిక్యాన్ని రికార్డు స్థాయిలో 1 లక్షా 18 వేలకు పెంచుకున్నాడు.
అందుకే మెజారిటీ తగ్గింది....
ఈ సారి రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయటం వలన, హరీష్ రావు సిద్దిపేటలో ఎక్కువ ప్రచారంలో పాల్గొన లేకపోయాడని, అందుకే తన మెజారిటీ తగ్గింది అని తన అనుచరులు అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం మొత్తం వ్యతిరేక పవనాలు వీయడం వల్ల సిద్దిపేటలో కూడా ఆ ప్రభావం ఎంతో కొంత పడిందని చెబుతున్నారు. సిద్దిపేటను ఎంతగానో అభివృద్ధి చేసిన హరీష్ రావుకు ఓట్లు, ఆధిక్యం తగ్గడం ఒక అశనిపాతంలాగా మారింది. ఈ పరిణామాల క్రమంలో, హరీష్ రావు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమయాన్ని సిద్దిపేట అభివృద్ధి కోసం, ప్రజల కోసం కేటాయిస్తాడని అయన అనుచరులు అంటున్నారు.
(హిందుస్తాన్ టైమ్స్, ఉమ్మడి మెదక్ జిల్లా)