Sujana Chowdary: విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా తెరపైకి సుజనా చౌదరి పేరు.. లోక్‌సభ ఆశలు గల్లంతు…-sujana choudharys name on the screen as vijayawada west candidate lok sabha hopes lost ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Sujana Chowdary: విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా తెరపైకి సుజనా చౌదరి పేరు.. లోక్‌సభ ఆశలు గల్లంతు…

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా తెరపైకి సుజనా చౌదరి పేరు.. లోక్‌సభ ఆశలు గల్లంతు…

Sarath chandra.B HT Telugu
Published Mar 25, 2024 08:51 AM IST

Sujana Chowdary: మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశలు గల్లంతయ్యాయి. లోక్‌సభకు పోటీ చేయాలని భావించినా ఆయన ఆశలు తీరలేదు. చివరకు అసెంబ్లీ టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయనున్న సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయనున్న సుజనా చౌదరి

Sujana Chowdary: మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి Sujana Chowdary విజయవాడ పశ్చిమ నియోజక  Vijaywada Westవర్గం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పార్టీకి కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

కృష్ణాజిల్లాకు Krishna District చెందిన సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి హైదరాబాద్‌లో స్థిరపడినా మూలాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ఆయన బంధువులు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోనే ఉన్నారు. మరోవైపు లోక్‌సభకు పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. విజయవాడ పార్లమెంటు స్థానం కోసం సుజనా ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు.

విజయవాడ లోక్‌సభ Loksabha నియోజక వర్గాన్ని వదులుకునేందుకు టీడీపీ సుముఖత చూపలేదు. ఓ దశలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా కోసం విజయవాడ పార్లమెంటు స్థానాన్ని వదులుకుంటారని ప్రచారం కూడా జరిగింది.

టీడీపీ తరపున రెండు సార్లు రాజ్యసభకు Rajyasabha ఎన్నికైన సుజనా చౌదరి తాజా ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలని భావించారు. సుజనా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మరో ఇద్దరితో కలిసి బీజేపీలో చేరారు. ఎన్డీఏ ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేశారు. పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందిన సుజనా చౌదరి వ్యాపారాసక్తులతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెబుతారు.

టీడీపీని వీడి బీజేపీలో చేరినా ఆ పార్టీ నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. విజయవాడ, ఏలూరు లోక్‌సభ నియోజక వర్గాల్లో ఏదొకటి దక్కుతుందని భావించారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆరు లోక్‌సభ స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితం కావడంతో సుజనా సీటు గల్లంతైంది.

విజయవాడ పశ్చిమ నుంచేనా…?

సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2014లో బీజేపీ తరపున పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయవాడ పశ్చిమలో ఒక్కసారి కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు. 1983లో మాత్రమే టీడీపీ అభ్యర్థి పశ్చిమలో గెలిచారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు.

తాజా ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని భావించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పోతిన మహేష్ ఈ సీటుపై ఆశలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. చివరి నిమిషంలో ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఓట్ల బదిలీపై కూడా అనుమానాలు ఉన్నాయి. పశ్చిమలో వైసీపీ మైనార్టీ అభ్యర్థికి సీటును కేటాయించింది.

బీజేపీ తరపున సుజనా చౌదరి పోటీ చేస్తే ఓట్ల బదిలీ కావడంతో పాటు జనసేన, టీడీపీ వర్గాల నుంచి ఏ మేరకు సహకారం లభిస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. సుజనా చౌదరికి మరో ప్రత్యామ్నయం కూడా లేకపోవడంతో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయడం కంటే అసెంబ్లీకి పోటీ చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చని సుజనా భావిస్తున్నట్టు చెబుతున్నారు.

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి మళ్లీ అసెంబ్లీ పోటీ చేయడంలో తప్పేమి ఉందని సుజనా అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ పశ్చిమలో ఉన్న టీడీపీ ప్రధాన నాయకులతో సుజనాకు సత్సంబంధాలు ఉండటం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే మంత్రి వర్గంలో చోటు కూడా దక్కొచ్చని చెబుతున్నారు.

Whats_app_banner