Zaheerabad Politics : జహీరాబాద్ టికెట్ కు కుల సమీకరణాలు-బరిలో లింగాయత్ వర్సెస్ కాపు
Zaheerabad Politics : జహీరాబాద్ లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీలు కుల సమీకరణాలు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ లింగాయత్ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ కాపు అభ్యర్థిని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తు్ంది.
Zaheerabad Politics : ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటారు రాజకీయ పార్టీలు, నాయకులు. అందులో ముందు వరుసలో ఉండేది కుల సమీకరణాలు(Caste Equations). ఆ ప్రాంతంలో ఏ కులం జనాభా ఎక్కువ ఉన్నారో చూసి వారికీ టికెట్ ఇచ్చి అవతలి పార్టీని బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నుతుంటారు రాజకీయ నాయకులు. దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కూడా ఇలాంటి వ్యూహాలే పన్నుతున్నారు మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి లింగాయత్ అభ్యర్థులు
లింగాయత్ లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన జహీరాబాద్ (Zaheerabad)మాజీ ఎంపీ, నారాయణఖేడ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సురేష్ షెట్కార్(Sureh Shetkar) బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ నియోజకవర్గానికి నుంచి పోటీ చేసి గెలిసిన లింగాయత్(Lingayat) సామాజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్(BB Patil) ని బీజేపీలోకి ఆహ్వానించి మరి తమ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
బీఆర్ఎస్ నుంచి కాపు సామాజిక నేత
రెండు ప్రధాన పార్టీలు కూడా ఒకే సామజిక వర్గానికి చెందిన నాయకులను బరిలోకి దించాలని నిర్ణయించుకోవడంతో, బీఆర్ఎస్ (BRS)పార్టీ తమ వ్యూహాన్ని మార్చుకుంది. ఇక్కడ ప్రధానంగా ఉన్న కాపు (Kapu)సామాజిక వర్గానికి చెందిన నాయకుడ్ని బరిలోకి దించాలని, ఆ పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన, గాలి అనిల్ కుమార్ ని తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ జహీరాబాద్ లోక్ సభ (Zaheerabad Lok Sabha Constituency)నియోజకవర్గానికి చెందిన ప్రధాన నాయకులతో పాటు, గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar)పోటీపై రెండు రోజుల కింద చర్చించారు. అనిల్ కుమార్ ని అభ్యర్థిగా బరిలోకి దించే విషయం పైన, పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ (Congress)పార్టీల మధ్య లింగాయత్ ల ఓట్లు చీలిపోతాయని, కాపు సామజిక వర్గానికి చెందిన మొత్తం ఓట్లు పడటం వలన తమ పార్టీకి లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ లో చేరిన గాలి
మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ పఠాన్ చెరు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించినా, తనకు సీటు ఇవ్వకపోవడంతో అనిల్ కుమార్ 2018 అసెంబ్లీ ఎన్నికలో ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2019 లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేసిన గాలి అనిల్ కుమార్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సీటు ఆశించినా తనకు టికెట్ రాకపోవడంతో మరొకసారి కాంగ్రెస్ పార్టీని వీడి, ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆశించిన గాలి అనిల్ కుమార్ కు, పార్టీ అధిష్టానం మాత్రం తనని జహీరాబాద్ నుంచి పోటీచేయమని కోరినట్టు తెలుస్తుంది.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండే
జహీరాబాద్ లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కామారెడ్డి(Kamareddy), జహీరాబాద్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ ఓడిపోయిన మూడు నియోజకవర్గాల్లో, కామారెడ్డి బీజేపీ గెలుచుకోగా, జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాలను మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.
సంబంధిత కథనం