Warangal Election Campaigns: నిన్న సీఎం.. నేడు పీఎం..ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న ఓరుగల్లు-yesterday the cm today the pm election campaign in warangal ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Election Campaigns: నిన్న సీఎం.. నేడు పీఎం..ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న ఓరుగల్లు

Warangal Election Campaigns: నిన్న సీఎం.. నేడు పీఎం..ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న ఓరుగల్లు

HT Telugu Desk HT Telugu
May 08, 2024 09:50 AM IST

Warangal Election Campaigns: లోక్ సభ ఎన్నికలకు ఇంకో వారం రోజులే సమయం ఉండటంతో ఓరుగల్లు ప్రచారాలతో హోరెత్తుతోంది. గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీల నాయకులు జనాల్లోకి వెళ్తుండగా.. తమ అభ్యర్థులను గెలిపించు కోవడానికి ఆయా పార్టీల అగ్రనేతలు కూడా వరంగల్ కు క్యూ కడుతున్నారు.

నేడు వరంగల్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
నేడు వరంగల్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం (HT_PRINT)

Warangal Election Campaigns: ఎన్నికల ప్రచారంతో వరంగల్ హోరెత్తుతోంది. ఇప్పటికే బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ ఒకసారి, కాంగ్రెస్​ అభ్యర్థి కోసం సీఎం రేవంత్​ రెడ్డి మూడు సార్లు వరంగల్ ను చుట్టేయగా.. బుధవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా వరంగల్​ లో అడుగుపెట్టనున్నారు. గురువారం రాజ్​ నాథ్​ సింగ్​ కూడా వరంగల్ ప్రచార సభలో పాల్గొననున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా రంగంలోకి దిగడంతో వరంగల్ మహానగరంలో ప్రచార వేడి పీక్స్​ చేరింది.

మూడు పార్టీలు ఢీ అంటే ఢీ

వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ సవాల్​ గా తీసుకున్నాయి. ఓ వైపు కడియం శ్రీహరి తమను మోసం చేసి కాంగ్రెస్​ పార్టీలో చేరాడంటూ గులాబీ పార్టీ గుర్రుగా ఉండగా.. కడియం శ్రీహరిని ఓడగొట్టి తమ కసి తీర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

మరోవైపు కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యకు ఈ ఎన్నిక చావోరేవో అన్నట్టుగా భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ టికెట్​ ఇచ్చినా వద్దనుకుని కాంగ్రెస్​ లో చేరగా.. ఎలాగైనా నెగ్గకపోతే పరువుపోతుందనే భావనలో ఉన్నారు. దీంతోనే కడియం శ్రీహరి, కావ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేంద్రంలో మరోసారి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీ.. ప్రతి స్థానాన్ని కీలకంగా భావిస్తోంది.

అందులో ప్రధానంగా వరంగల్ ను టార్గెట్​ చేసింది. ఇక్కడ అరూరి రమేశ్​ బరిలో ఉండగా.. ఆయన కూడా వరంగల్ సీటు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇలా మూడు పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రజాక్షేత్రంలో సవాళ్లు విసురుకుంటున్నాయి. దీంతో ఓరుగల్లు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

సీఎం రేవంత్​ రెడ్డి మూడు సభలు

వరంగల్​ లోక్​ స్థానంపై గురి పెట్టిన ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. కాగా మూడు పార్టీల అగ్రనేతలు కూడా వరంగల్​ సీటును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. దీంతోనే వరుస టూర్లతో వరంగల్ రాజకీయాల్లో మరింత హీట్​ పెంచుతున్నారు.

ఏప్రిల్​ 24న బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్​ మారపెల్లి సుధీర్​ కుమార్​ తరఫున రోడ్డు షో నిర్వహించి, పార్టీకి మరోసారి హైప్​ తీసుకొచ్చారు. దీంతో పోటీలో లేడనుకున్న బీఆర్​ఎస్​ అభ్యర్థి.. ఫుల్​ జోష్​ తో జనాల్లో తిరుగుతున్నాడు. ఇక కడియం శ్రీహరి పార్టీ మార్పు పరిణామాల నేపథ్యంలో వరంగల్ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సవాల్​ గా తీసుకున్నారు.

ఈ మేరకు కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ ఇప్పటికే వరంగల్ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో రెండు సార్లు ప్రచార సభలు నిర్వహించారు. మంగళవారం భారీ వర్షం కురిసినా లెక్క చేయకుండా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించి, కార్నర్​ మీటింగుల్లో మాట్లాడి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది.

ఇవ్వాళ వరంగల్ కు మోదీ

ఓ వైపు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ప్రచార కార్యక్రమాలతో ఊపు మీదుండగా.. బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్​ కు మద్దతుగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఈ మేరకు బుధవారం వరంగల్ కు రానున్నారు.

ముందుగా కరీంనగర్​ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో రాజరాజేశ్వర స్వామికి పూజల అనంతరం బండి సంజయ్ కి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొనున్నారు. అక్కడ సభ అనంతరం మోదీ నేరుగా వరంగల్ కు చేరుకోనున్నారు. మామునూరు ఎయిర్​ పోర్టుకు హెలీ క్యాప్టర్​ లో చేరుకోనున్న ఆయన లక్ష్మీపురం వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఉదయం 11.55 గంటలకు వరంగల్ కు 12.50 నిమిషాలకు ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఆయన తిరుపతి వెళ్లనున్నారు. కాగా బీజేపీ అగ్రనేత, భారత ప్రధాని నేరుగా రంగంలోకి దిగడంతో అరూరి రమేశ్​ కొంత ఉత్సాహంలో ఉన్నారు. ఏకంగా ప్రధాని వరంగల్ నగరానికి వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు పార్టీల అగ్రనేతల ప్రచారాలతో ఓరుగల్లులో సందడి నెలకొనగా.. జనాలు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం