Lok Sabha Elections 2024 : బీజేపీ ఖమ్మం ఎంపీ టిక్కెట్ జలగంకేనా..?
Khammam MP Ticket 2024 : బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటీవలే బీజేపీలో చేరారు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. అయితే ఆయన ఖమ్మం ఎంపీ టికెట్ ను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
Jalagam Venkat Rao: బీజేపీకి అంతగా పట్టులేని ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించగా అధికార కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ నేపథ్యంలో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు(Jalagam Venkat Rao BJP) ఖమ్మం ఎంపీ టిక్కెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలోనూ టిక్కెట్ ఆశిస్తున్న వారు లేకపోలేదు. ఖమ్మంలో ప్రముఖ వైద్యుడు గోంగూర వెంకటేశ్వరరావు బీజేపీ ఖమ్మం అభ్యర్థిని తానేనని చెప్పుకుంటున్నారు. కాగా జలగం వెంకట్రావు చేరికతో జిల్లాలో పరిచయం అవసరంలేని జలగంకే అంతిమంగా టిక్కెట్ దక్కుతుందన్న చర్చ మొదలైంది.
జిల్లాలో టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్యే..
గులాబీ జెండా పట్టుకునే నాధులే లేని ఆ రోజుల్లో ఆయన ఖమ్మంలో ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు(Jalagam Venkat Rao) కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేత. గతంలో తన తండ్రి పని చేసిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఆ తర్వాత ఆ పార్టీలో తనకు సముచిత స్థానం లభించకపోవడంతో 2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా జలగం పోటీలో నిలిచి నాడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు పై విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు కొత్తగూడెం మాత్రమే. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావుపై పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓటమి చెందారు. కాగా ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు జలగం భవిష్యత్తును మసకబారేలా చేశాయి. కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన వనమా ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో జలగం ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బిఆర్ఎస్ తరపున టికెట్ లభిస్తుందని ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకే బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం లభించడంతో జలగం వెంకట్రావు భంగపాటుకు గురయ్యారు. అయితే ఎలాగైనా ఆ ఎన్నికల్లో పోటీలో నిలవాలని భావించిన ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించారు. ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ సిపిఐ పార్టీతో కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో కొత్తగూడెం స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ లోనూ ఆయనకు చుక్కెదురయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జలగం వెంకట్రావు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి సిట్టింగ్ అభ్యర్థి వనమాకు గట్టి పోటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో కొత్తగూడెం (Kothagudem)నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. టిఆర్ఎస్ కు అలాగే కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కునంనేని సాంబశివరావుకు మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని భావించిన క్రమంలో జలగం వెంకట్రావు రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రధాన అభ్యర్థులిద్దరికీ గట్టి పోటీ ఇచ్చారు. చెప్పుకోదగిన ఓట్లను సాధించారు కూడా.
టిక్కెట్ ఆశించే బీజేపీలోకి..?
జలగం వెంకట్రావు(Jalagam Venkat Rao) ఖమ్మం టిక్కెట్ ఆశించే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జిల్లాకు చెందిన పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మం టిక్కెట్ ఇచ్చే హామీ మేరకే వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీకి కూడా పెద్దగా పట్టులేని క్రమంలో రాజకీయ నేపథ్యం కలిగి, బలమైన అభ్యర్థిని పోటీలో నిలిపితే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించి జలగంను చేర్చుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం ఖమ్మం టిక్కెట్ ను జలగం వెంకట్రావుకే కేటాయిస్తే త్రిముఖ పోటీ అనివార్యం కానుంది.