Abdul Salam : బీజేపీ తొలి జాబితాలో కనిపించిన ఏకైక ముస్లిం అభ్యర్థి.. ఎవరీ అబ్దుల్ సలాం?
Who is Abdul Salam : కాలికట్ యూనివర్సిటీ మాజీ వీసీ అబ్దుల్ సలాం లోక్‌సభ ఎన్నికల్లో మలప్పురం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు.. బీజేపీ లోక్‌సభ ఎన్నికల తొలి లిస్ట్‌లో ఆయన పేరు కనిపించింది.
BJP first list for Lok Sabha elections : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో ఓ అభ్యర్థి పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆ అభ్యర్థి పేరు అబ్దుల్ సలామ్. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కనిపించిన ఏకైక ముస్లిం అభ్యర్థి.. అబ్దుల్ సలామ్.
కాలికట్ యూనివర్సిటీ మాజీ వీసీ అబ్దుల్ సలాం కేరళలోని మలప్పురం నుంచి పోటీ చేస్తారని బీజేపీ శనివారం ప్రకటించింది.
అబ్దుల్ సలాం ఎవరు?
అబ్దుల్ సలాం స్వస్థలం కేరళలోని తిరూర్.
తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2018 వరకు.. బయోలాజికల్ సైన్సెస్‌లో 153 పరిశోధనా పత్రాలు, 15 సమీక్షా వ్యాసాలు, 13 పుస్తకాలను ప్రచురించారు అబ్దుల్ సలాం.
అబ్దుల్ సలాం 2019లో బీజేపీలో చేరారు.
Abdul Salam BJP : 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 135 నెమోమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
అబ్దుల్ సలాం 2011 నుంచి 2015 వరకు కాలికట్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
ఆయన నికర ఆస్తుల విలువ రూ.6.47 కోట్లు.
ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని నివేదికలు చెబుతున్నాయి.
కేరళలో లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ సీట్లు 12.
త్రిస్సూర్ స్థానం నుంచి ప్రముఖ సినీ నటుడు సురేశ్ గోపి, పతనంతిట్ట నుంచి మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీని బరిలోకి దింపింది కమలదళం. కోజికోడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంటీ రమేష్ పోటీ చేస్తున్నారు.
BJP first list : కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్న తిరువనంతపురం నుంచి కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను బరిలోకి దింపారు.
12 మంది సభ్యుల జాబితాలో బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పేరు లేకపోవడం చర్చకు దారి తీసింది.
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా..
2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో.. పార్టీ 51 మంది అభ్యర్థులను నామినేట్ చేయగా, పశ్చిమ బెంగాల్లో 20 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. మధ్యప్రదేశ్‌లో 24 మంది, గుజరాత్లో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. రాజస్థాన్‌లో 15 మంది బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలో 12 మంది, తెలంగాణలో 9 మంది బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అసోం, జార్ఖండ్, చత్తీస్ గఢ్ లలో చెరో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఢిల్లీలో ఐదుగురు, జమ్ముకశ్మీర్ లో ఇద్దరు అభ్యర్థులు నిలిచారు. ఉత్తరాఖండ్ లో ముగ్గురు, అరుణాచల్ ప్రదేశ్, గోవాలో ఇద్దరు చొప్పున, త్రిపుర, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూలలో ఒక్కో అభ్యర్థి పోటీలో నిలబడనున్నారు.
సంబంధిత కథనం