HT interview with PM Modi : ‘మేము చేసిన అభివృద్ధిని చూసే.. ప్రజలు మాకు ఓట్లేస్తారు’- మోదీ-we dont need populism people have seen scale and speed at which we deliver says modi in 2024 lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ht Interview With Pm Modi : ‘మేము చేసిన అభివృద్ధిని చూసే.. ప్రజలు మాకు ఓట్లేస్తారు’- మోదీ

HT interview with PM Modi : ‘మేము చేసిన అభివృద్ధిని చూసే.. ప్రజలు మాకు ఓట్లేస్తారు’- మోదీ

Sharath Chitturi HT Telugu
May 14, 2024 07:20 AM IST

PM Modi latest news : మధ్యంతర బడ్జెట్​లో ప్రజాకర్షక చర్యలు తీసుకోకపోవడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని, ప్రజాకర్షక చర్యలు అవసరం లేదని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (BJP )

PM Modi 2024 lok Sabha elections : మధ్యంతర బడ్జెట్​లో ప్రజాకర్షక చర్యలు తీసుకోనప్పటికీ.. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి గెలుపువైపు దూసుకెళుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత 10ఏళ్లల్లో ప్రజలు.. దేశాభివృద్ధిని చూశారని, అందుకే.. ప్రజాకర్షక చర్యలు కనిపించకపోయినా.. తమ జీవితాల్లో కనిపించిన మార్పులు చూసి బీజేపీకి ఓటు వేస్తారని అన్నారు. ఈ మేరకు.. ఆర్​ సుకుమార్​, శిశిర్​ గుప్తా, సునేత్రా చౌదరీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఈసారి దక్షిణ భారతంలో తాము బలమైన ప్రదర్శన చేస్తామని అన్నారు మోదీ. దక్షిణాదిన.. విపక్షాలు బరిలో దింపిన అభ్యర్థుల ఓటమి తప్పదమని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు అందుతున్న రిజర్వేషన్లను తొలగించేందుకు కాంగ్రెస్​ పార్టీ ప్రయత్నిస్తోందని, విపక్షాలన్నీ.. దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

‘ఎన్నికల వేళ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎలాంటి చర్యలు లేవెందుకు?’ అని అడిగిన ప్రశ్నకు.. "10ఏళ్ల పాటు మేము చాలా కష్టపడ్డామని ప్రజలు గుర్తించారు. మా ట్రాక్​ రికార్డ్​ వల్ల.. ఎన్నికలకు ముందు ప్రత్యేకమైన, ప్రజాకర్షక చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. పైగా.. ఇది ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచింది," అని జవాబిచ్చారు మోదీ.

మధ్యంతర బడ్జెట్​లో ఆర్థిక ఏకీకరణపై ఫోకస్​ పెట్టారని, ఎన్నికల వేళ భారీ ప్రకటనలేవీ లేవని.. బీజేపీపై నాడు పలువురు ప్రశంసలు కురిపించారు.

'పేదల అభ్యున్నతే మా లక్ష్యం..'

2024 lok Sabha elections BJP : చేసిన హామీలను ఎన్​డీఏ ప్రభుత్వం ఎంత వేగంగా పూర్తి చేసిందో ప్రజలు చూశారని మోదీ అన్నారు. అదే సమయంలో.. ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, విమానాశ్రయాలు- హైవేల విస్తరణ, ఆరోగ్య వ్యవస్థ మెరుగుదల, ఆన్​లైన్​ పేమెంట్స్​లో తాము సాధించిన అభివృద్ధిని వివరించారు.

"ప్రతి ఒక్కరి జీవితాలను బలోపేతం చేయడం ఎలాగో.. మేము ఈ 10ఏళ్లల్లో చేసి చూపించాము. జీవితంలో విజయం సాధించేందుకు ప్రజలకు కావాల్సినవి అన్ని ఇచ్చాము. పేదల అభ్యున్నతే మా లక్ష్యం. వారి జీవితాలు మెరుగుపడేందుకు మేము అవకాశాలను కల్పించాము," అని ప్రధాని చెప్పుకొచ్చారు.

తాము ఇంత అభివృద్ధి సాధిస్తుంటే.. విపక్షాలు మాత్రం.. ప్రజల సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు మోదీ. వారి అజెండా అదేనని అన్నారు.

"పేదల అభ్యున్నతి చుట్టూ మా పాలసీలు ఉంటాయి. మేము చేసే ప్రతి పనిలోనూ పేదలు కేంద్రబిందువుగా ఉంటారు. కానీ విపక్షాలకు మాత్రం 'మోదీ హటావో' (మోదీని గద్దెదించండి) అని అంటున్నాయి. ఇలాంటి మత రాజకీయాలకు ప్రజలు పడరు," అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మోదీని మళ్లీ ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని బీజేపీతో పాటు ఎన్​డీఏ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే జరిగితే.. మాజీ ప్రధానమంత్రి జవహర్​లాల్​ నెహ్రూ తర్వాత.. వరుసగా మూడోసారి పీఎం అయిన వ్యక్తిగా భారత దేశ చరిత్రలో నిలిచిపోతారు మోదీ.

కానీ.. గతంతో పోల్చుకుంటే.. మోదీ టీమ్​కి విపక్ష ఇండియా కూటమి ఈసారి గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తాము చేసిన అభివృద్ధే ప్రజలు తమకు ఓట్లు వేసేలా చేస్తుందని మోదీ అంటున్నారు.

‘మేము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది..’

"1984లో బీజేపీకి రెండే సీట్లు వచ్చాయి. 2019లో సొంతంగా 303 సీట్లు సంపాదించుకున్నాము. కానీ పార్టీలో అసంతృప్తి ఉందనడం సరికాదు. ఒక ఎలక్షన్​ గెలిచేశాము.. ఇక హాయిగా విశ్రాంతి తీసుకుందాము అన్న మైండ్​సెట్​తో మేము పార్టీని నిర్మించలేదు. ప్రతి విజయాన్ని బాధ్యతగా తీసుకున్నాము. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడ్డాము. ప్రజా సేవకు మా కార్యకర్తలు నిత్యం కృషి చేస్తున్నారు. అందుకే.. బీజేపీలో అసంతృప్తి ఉందని అనడం సరికాదు. 2047 వికసిత్​ భారత్​ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే మేము ఇక్కడ ఉన్నది. అందుకోసం.. 2047 వరకు 24/7 పనిచేస్తాము," అని 2024 లోక్​సభ ఎన్నికల వేళ ఇచ్చిన ఇంటర్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మోదీ చాలా అగ్రెసివ్​గా ప్రచారాలు చేస్తున్నారు. ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్​ తీసేసి, వాటిని ముస్లింలకు ఇస్తుందని ఆరోపించారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​ ప్రసంగాన్ని చూపిస్తూ.. ప్రజల సంపదను ముస్లింల చేతిలో పెట్టేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

2024 lok Sabha elections : "ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించి, ఆ ప్రయోజనాలను తన ఓటు బ్యాంకులో ముఖ్యమైన వారికి ఇవ్వాలని కాంగ్రెస్​ అజెండాగా పెట్టుకుంది. దానిని అందరం ప్రశ్నించాలి. ఎన్నికల్లో మతం, విభజన రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్​ పార్టీనే. ఇదే విషయంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళన మా ఆందోళన. మా ప్రశ్నలకు కాంగ్రెస్​ జవాబు చెప్పాల్సిందే," అని మోదీ అన్నారు.

మోదీ చేసిన ఆ ఆరోపణలు.. దేశ రాజకీయల్లో పెను ప్రకంపనలను సృష్టించింది. మోదీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్​ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

ప్రజ్వల్​ రేవన్న వివాదంపై..

Prajwal Revanna sex scandal : మరోవైపు.. 2024 లోక్​సభ ఎన్నికల వేళ.. జేడీఎస్​ బహష్కృత ఎంపీ హెచ్​డీ ప్రజ్వల్​ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి, రేప్​ ఆరోపణలపైనా.. ఈ ఇంటర్వ్యూలో స్పందించారు ప్రధాని మోదీ.

"చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానమే అని నేను విశ్వసిస్తాను. అది బెంగాల్​లోని సందేశ్​ఖాలీ అయినా.. కర్ణాటకలోని హసన్​ అయినా, నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలి. శాంతిభద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది," అని మోదీ అన్నారు.

పశ్చిమ్​ బెంగాల్​ సందేశ్​ఖాలీలో స్థానిక టీఎంసీ నేతపై భూ దందా, మహిళలపై లైంగిక దాడి వంటి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆరోపణలు చేసిన మహిళలు ఇప్పుడు.. 'స్థానిక బీజేపీ నేతలు తమని తప్పుదోవ పట్టించారు,' అని అంటుండటం గమనార్హం.

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాలపై వస్తున్న ఆరోపణల మీదా మోదీ స్పందించారు.

"మా పార్టీ మేనిఫెస్టో లేదా మా నేతల ప్రసంగాలు చూస్తే.. అభివృద్ధి భారతాన్ని రూపొందించడమే మా లక్ష్యం అని స్పష్టంగా తెలుస్తుంది," అని ప్రధాని అన్నారు.

దక్షిణ భారతంలో..

BJP in south India : ఉత్తర భారతంలో బీజేపీకి మంచి పట్టు ఉన్నా.. దక్షిణాదిన కమలదళానికి గతంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిపై తాజాగా మోదీ స్పందించారు.

"దక్షిణాది ప్రజలతో మాకు మంచి కనెక్షన్​ ఉంది. తమిళనాడు, ప్రజలకు మేము కొత్త కాదు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా.. మా జీవితాలను ప్రజా సేవకు అంకితం చేశాము. దక్షిణ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి చెందిన వారసత్వ రాజకీయాలు, అవినీతిని చూసి ప్రజలు విసుగెత్తిపోయారు. బీజపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అభివృద్ధి, పురోగతిపై మేము ఇస్తున్న సందేశాలు.. దక్షిణ భారత ప్రజలకు నచ్చుతోంది," అని మోదీ అన్నారు.

సంబంధిత కథనం