Orugallu Polling: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఓటింగ్ శాతం కొంత మెరుగ్గా నమోదైంది. అందులోనూ పట్టణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్ల కంటే రూరల్ నియోజకవర్గాల్లోనే ఎక్కువ పోలింగ్ శాతం జరగడం గమనార్హం.
వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరగగా అప్పుడు ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 15, 37,778 లక్షల మంది ఓటర్లకుగానూ 11,76,653 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దీంతో 76.52 పోలింగ్ పర్సంటేజీ నమోదైంది. ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో 2015లో బై ఎలక్షన్ నిర్వహించగా.. అప్పుడు 10,34,840 మంది ఓటేయగా.. 68.5 శాతం పోలింగ్ జరిగింది. ఇక 2019 జనరల్ ఎలక్షన్స్ లో ఎలక్షన్ నాటికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 16,66,085 మంది ఓటర్లు ఉండగా.. అందులో 10,60,412 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం 63.65 గా నమోదైంది.
గత మూడు ఎలక్షన్స్ చూస్తే వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తుండగా.. ఈసారి మాత్రం ఏకంగా ఐదు శాతం పెరుగుదల కనిపించింది. 2024 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 18,24,466 మంది ఓటర్లు ఉండగా... ఈసారి దాదాపు 12,45,927 మంది వరకు ఓట్లేశారు. దీంతో ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ 68.29 పోలింగ్ శాతం నమోదైంది. గతంతో పోలిస్తే దాదాపు ఐదు శాతం మెరుగుపడటం కాస్త ఊరటనిచ్చే అంశం.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ పెరిగింది. 2014 ఎన్నికల్లో 11.26 లక్షల మంది ఓటర్లకు 81.21 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇక 2019 ఎన్నికల నాటికి 69.06 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలు ఉండగా.. ఈసారి మొత్తంగా 15,32,366 మంది ఓటర్లు నమోదయ్యారు. కాగా ఇదివరతో పోలిస్తే ఇక్కడ కూడా పోలింగ్ శాతం పెరిగింది. మొత్తంగా 10,83,076 మంది వరకు ఓటు హక్కు వినియోగించుకోగా.. ఓవరాల్గా 70.68 పోలింగ్ పర్సంటేజీ నమోదైంది. కాగా గత ఎన్నికలతో పోలిస్తే 1.39 శాతం ఓట్లు పెరిగాయి.
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నడిచింది. వరంగల్ లో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ పోటీలో నిలవగా.. మహబూబాబాద్ లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ఈసారి రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ శాతం పెరగగా.. ఎవరికి కలిసి వస్తుందోననే చర్చ జరుగుతోంది. సిట్టింగ్ పార్టీ అయిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తరువాత పూర్తిగా ఢీలా పడిపోగా.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. దీంతో పెరిగిన ఓటింగ్ శాతంపై అభ్యర్థులు కూడా లెక్కలేసుకుంటున్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుండగా.. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)