కడియంను పార్టీలోకి తీసుకోవద్దు...! నిరసనలకు సిద్ధమవుతున్న స్థానిక కాంగ్రెస్ నేతలు, బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు-warangal local congress leaders are opposing kadiyam srihari joining in party ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Warangal Local Congress Leaders Are Opposing Kadiyam Srihari Joining In Party

కడియంను పార్టీలోకి తీసుకోవద్దు...! నిరసనలకు సిద్ధమవుతున్న స్థానిక కాంగ్రెస్ నేతలు, బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు

HT Telugu Desk HT Telugu
Mar 30, 2024 11:28 AM IST

Warangal Congress : కడియం శ్రీహరి రాకను స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన కడియంను పార్టీలోకి తీసుకోవద్దని కోరుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించుకుంటున్నారు.

పార్టీ నేతలతో ఇందిరా
పార్టీ నేతలతో ఇందిరా

Warangal Congress : ఓరుగల్లు రాజకీయాల్లో కడియం శ్రీహరి(Kadiyam Srihari) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన కూతురు కావ్యకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆమె పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లిన కడియం శ్రీహరి, తన కూతురు కావ్యతో కలిసి హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడో, రేపో అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇదిలాఉంటే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరడాన్ని పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నేత సింగపురం ఇందిర మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆమె.. కడియం శ్రీహరిని పార్టీలోకి చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేశారు. శుక్రవారం సాయంత్రం తన అనుచరులతో మీటింగ్ నిర్వహించిన ఆమె.. గాంధీ భవన్ తో పాటు ఏఐసీసీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో పార్టీ పెద్దలు ఆమెను బుజ్జగించే పనిలో పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

కడియం ఇంటికి ఏఐసీసీ నేతలు

కడియం శ్రీహరి, ఆయన కూతురు కాంగ్రెస్ లో చేరడం ఖరారైపోగా.. హైదరాబాద్ లోని వారి నివాసానికి ఏఐసీసీ నేతలు వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు కడియం శ్రీహరి, కావ్యతో చాలాసేపు చర్చించారు. కాగా శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో కడియం శ్రీహరి తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి కడియం ముఖ్య అనుచరులంతా ఉదయమే హైదరాబాద్ తరిలారు. దాదాపు 50 వాహనాల్లో బయలు దేరి కడియం వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం కడియం శ్రీహరి.. అక్కడే మీడియా సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు తెలిపారు.

టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఇందిరా

కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నేత సింగపురం ఇందిరా కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి, సింగపురం ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి దాదాపు 7,700 మెజారీటీతో ఇందిరపై విజయం సాధించారు. ఇదిలాఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఇందిరా పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతాలు మాత్రం రాలేదు.

కడియంను చేర్చుకోవద్దని నిరసనలకు ప్లాన్

ఇదిలాఉంటే కడియం శ్రీహరి, సింగపురం ఇందిరా మధ్య విభేదాలు ఉండగా.. తాజాగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో ఇందిరా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కడియం ను కాంగ్రెస్ లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఆ తరువాత ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట కూడా ఆందోళనలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇదిలాఉంటే ఫిబ్రవరి నెలలో స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్రయత్నం చేసిన సమయంలోనూ ఇందిరా అడ్డుకున్నారు. రాజయ్యను పార్టీలోకి తీసుకుంటే చాలా నష్టం జరుగుతుందని, గాంధీ భవన్ ఎదుట తన అనుచరులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పార్టీ అధిష్టానం రాజయ్యను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో ఆలోచనలో పడింది. ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలోనూ సింగపురం ఇందిరా మోకాలడ్డుతుండటంతో ఆయన కూడా కొంత కంగారు పడుతున్నట్లు తెలిసింది.

బుజ్జగిస్తున్న నేతలు

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పేరు సంపాదించుకున్న సింగపురం ఇందిర అటు కడియం శ్రీహరి, ఇటు తాటికొండ రాజయ్యకు కొరకరాని కొయ్యగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన ఉనికికి ప్రమాదం ఏర్పడవద్దనే ఉద్దేశంతో పాటు తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కడియం కు ఎలా ఇస్తారంటూ కడియం శ్రీహరి కాంగ్రెస్ ఎంట్రీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం కడియం శ్రీహరి, కావ్యను పార్టీలోకి తీసుకుని, ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ కట్టబెట్టే యోచనలో ఉంది. కానీ ఇందిర వ్యతిరేక స్వరం వినిపిస్తుండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు ఏఐసీసీ నేతలు ఇందిరను బుజ్జగించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో ఏదైనా పదవి ఇచ్చి అయినా ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరి వారి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.. ఇందిరా వ్యూహాలు ఏమేరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు

WhatsApp channel