Lok Sabha Election 2024 Phase 6 : లోక్‌సభ ఆరో విడత ఎన్నికలు - 58 స్థానాల్లో పోలింగ్ ప్రారంభం, అందరిచూపు ఢిల్లీ వైపే..!
Lok Sabha Election 2024 Phase 6 Updates: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
Lok Sabha Election 2024 Phase 6 Updates: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ఐదు దశలు పూర్తి కాగా… ఇవాళ ఆరో దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
58 స్థానాాల్లో పోలింగ్….
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఆరో విడతలో 58 లోక్‌సభ స్థానాలకు మొత్తం 889 మంది అభ్యర్థుల పోటీ చేస్తున్నారు. ఇందులో ఢిల్లీ 7, హర్యానా 10, యూపీ 14, పశ్చిమబెంగాల్ 8, బిహార్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూకశ్మీర్‌లో 1 స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆరో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఢిల్లీ, హర్యానాలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ చేస్తున్న ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు మెహబూబా ముఫ్తీ ఉన్నారు.
కర్నాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఖట్టర్ పోటీ చేస్తున్నారు. అనంతనాగ్-రాజౌౌరీ నుంచి పీడీపీ అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ బరిలో ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ వంటి ప్రముఖ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఆసక్తికరంగా ఢిల్లీ పోరు….
ఈ దశలో అందరిచూపు దేశ రాజధాని ఢిల్లీ వైపు ఉంది. ఇక్కడ ఉన్న 7 పార్లమెంట్ స్థానాలకు ఇదే దశలో పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఉన్న మొత్తం సీట్లలో బీజేపీ పాగా వేసింది. అయితే ఈసారి బీజేపీకి బ్రేకులు వేసే దిశగా ఆప్ తో పాటు కాంగ్రెస్ అడుగులు వేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా…. దేశ రాజధానిలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ నాలుగు స్థానాల్లో అభ్యర్తులను నిలబెట్టింది.
జైలు నుంచి బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్ ఇటీవలే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఈసారి ఢిల్లీలోని 7 సీట్లలో ఎవరు పాగా వేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ సత్తా చాటింది. అయితే ఈసారి ఇక్కడ కాంగ్రెస్, ఆప్ సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. హిస్సార్‌తో సహా రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో హోరీహోరీ పోటీ ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఆరో దశతో మొత్తం 486 లోక్ సభ నియోజకవర్గ సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఇక తుది విడత ఎన్నికల పోలింగ్ జూన్ 1వ తేదీన జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 57 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు రానున్నాయి.