Warangal Loksabha Pooling : ఫలించని ప్రయత్నాలు..! ఓరుగల్లులో తగ్గుతూ వస్తున్న పోలింగ్ శాతం..!
Warangal Lok Sabha Election 2024 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. 2014 నుంచి చూస్తే వరంగల్ పార్లమెంట్ స్థానానికి 3 సార్లు ఎన్నికలు జరగా… క్రమంగా పోలింగ్ శాతం తగ్గిపోయింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ… పోలింగ్ శాతం పెరగటం లేదు.
Warangal Lok Sabha Constituency : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా అధికారులు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటికి రెండు పార్లమెంట్ ఎన్నికలు జరగగా, వరంగల్ లో ఒక ఉప ఎన్నికతో కలిసి మూడు సార్లు ఎన్నిక జరిగింది. ఈ మూడు ఎన్నికల్లో పోలింగ్ సరళి పరిశీలిస్తే… 2014 నుంచి 2019 నాటికి ఏకంగా 12 శాతానికిపైగా ఓటింగ్ శాతం పడిపోయింది. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటి నడుస్తుండటంతో తగ్గుతున్న పోలింగ్ శాతం ఎవరికి ఎలాంటి ఫలితాలను మిగులుస్తుందోనని అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
ఆసక్తి చూపని జనాలు
వరంగల్ లోక్ సభ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరగగా, ఆ సమయంలో ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 15, 37,778 లక్షల మంది ఓటర్లు నమోదై ఉన్నారు. కాగా ఇందులో 1,176,653 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. 76.52 పోలింగ్ పర్సంటేజీ నమోదైంది.
వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో 2015లో బై ఎలక్షన్ నిర్వహించారు. ఇందులో 10,34,840 మంది మాత్రమే ఓటేశారు. దీంతో 68.5 శాతం పోలింగ్ జరగగా, 2019 జనరల్ ఎలక్షన్స్ నాటికి ఓటింగ్ శాతం మరింత తగ్గింది.
2019 ఎలక్షన్ నాటికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 16,66,085 మంది ఓటర్లు నమోదై ఉండగా.. అందులో 10,60,412 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 63.65 పోలింగ్ శాతం మాత్రమే రికార్డ్ అయ్యింది. 2014 తో పోలిస్తే దాదాపు 12 శాతానికి పైగా ఓటింగ్ శాతం తగ్గగా.. ఏటికెడు ఇలా పోలింగ్ పర్సంటేజీ తగ్గుతూ వస్తుండటం కలవరానికి గురి చేస్తోంది.
మహబూబాబాద్ లో ఇలా..
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో 15 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా, 2014 లోక్ సభ ఎన్నికల్లో 11.26 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 81.21 పోలింగ్ శాతం నమోదయింది.
ఇక 2019 ఎన్నికల నాటికి 69.06 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 2014తో పోలిస్తే 2019 నాటికి దాదాపు 12 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. ఓ వైపు జిల్లా అధికారులు ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండగా, లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గితే ఎవరిపై ప్రభావం ఉంటుందోనని అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తుంది.