BRS MP Candidates 2024 : ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ..! 'నై' అంటున్న నేతలు, బుజ్జగిస్తున్న అధినాయకత్వం-the leaders are taking a step back to contest as an mp candidate from brs in loksabha polls 2024 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  The Leaders Are Taking A Step Back To Contest As An Mp Candidate From Brs In Loksabha Polls 2024

BRS MP Candidates 2024 : ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ..! 'నై' అంటున్న నేతలు, బుజ్జగిస్తున్న అధినాయకత్వం

HT Telugu Desk HT Telugu
Mar 06, 2024 04:29 PM IST

Loksabha Elections 2024 in Telangana: పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారాయి. ఎన్నికల వేళ పలువురు నేతలు పార్టీని వీడుతుండటం ఇబ్బందికరంగా మారింది. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కూడా కొందరు నేతలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికలు 2024
లోక్ సభ ఎన్నికలు 2024

BRS MP Candidates 2024 : త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో(loksabha polls 2024) భారత రాష్ట్ర సమితి (BRS Pary) అభ్యర్థుల కోసం గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుందా..? ఆ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి నాయకులు వెనకడుగు వేస్తున్నారా..? చివరకు సిట్టింగ్ ఎంపీలు సైతం ముఖం చాటేస్తుండడంతో వారిని బుజ్జగించే పనిలో పార్టీ హైకమాండ్ పడిందా..? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులు ఎత్తేసేలా కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

మారిన వాతావరణం….

తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను గడిచిన 2014, 2019 ఎన్నికల్లో మినహా అన్ని చోట్లా పోటీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో 5 స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన నాటి టీఆర్ఎస్ 2009 ఎన్నికల నాటికి రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 17 ఎంపీ స్థానాలకు గాను ఏకంగా 11 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మాత్రం రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయి 9 చోట్ల గెలచింది. అయితే, తెలగాణలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2018 లో గెలుచుకున్న 88 సీట్ల నుంచి 39 స్థానాలకు పడిపోయింది. పార్టీకి బాగా పట్టుందని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సైతం బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది. అధికారాన్ని కోల్పోవడం, ఎమ్మెల్యే స్థానాల సంఖ్య బాగా తగ్గిపోవడం వంటి కారణాలతో ఇపుడు ఆ పార్టీలో రాజకీయ వాతావరణం మారిపోయిందంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిట్టింగులతో పాటు, ఇన్నాళ్లూ టికెట్ కావాలని పట్టుబట్టిన వారు కూడా వెనకడుగు వేస్తున్నారని చెబుతున్నారు.

పార్టీ నుంచి వెళ్లిపోతున్న సిట్టింగు ఎంపీలు

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) నుంచి పోటీ చేసినా.. పార్టీ నుంచి ఎన్నికల ఖర్చు కోసం పెద్దగా అండదండలు ఉండవన్న అభిప్రాయం, సొంత నిధులు ఖర్చు చేసినా.. తమ తమ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో గెలవడం కష్టమన్న నిర్ణయానికి వచ్చాకే పలువురు సిట్టింగులు పునరాలోచనలో పడ్డారని, వారిలో కొందరు పార్టీ మారుతుండగా, మరికొందరు పోటీకి దూరంగా ఉండాలన నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్.. ఇద్దరూ బీజేపీలో చేరగా, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరారు. అంటే సిట్టింగులో ఇక మిగిలింది కేవలం ఆరుగురు ఎంపీలే కావడం గమనార్హం. వీరిలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తాను పోటీ చేయనని ఇప్పటికే హై కమాండ్ కు ఖరాఖండిగా చెప్పేశారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నాలుగ చోట్లా కొత్త అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితిలో పార్టీ ఉంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు సైతం పోటీ చేయనని భీష్మించినా చివరకు ఒప్పించి టికెట్ ఖరారు చేశారు. మహబూబాబాద్ ఎంపీ కవిత కూడా సుతారాము ఇష్టం లేదని చెప్పినా టికెట్ ప్రకటించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఇపుడు అభ్యర్థులను వెదుకుతున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు టికెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ఆయన కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరగడంతో పార్టీ నాయకత్వం రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించింది.

వెనకడుగు వేస్తున్న నేతలు

లోక్ సభ ఎన్నికల్లో(Loksabha Elections 2024 ) కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నం చేయకతప్పదా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సిట్టింగ్ ఎంపీలు మారిన పెద్దపల్లికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. నాగర్ కర్నూలులో బీఎస్పీ నుంచి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు (BRS BSP Alliance)పెట్టుకుంటోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మెజారిటీ నాయకులు తమ తమ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోవడంతో ఆ ప్రభావం ఎంపీ ఎన్నికలపైనా ఉంటుందని, ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితులు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయానికి వచ్చాకే వెనకడుగు వేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ)

WhatsApp channel