Telangana Loksabha Election Results 2024 : తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. మే 13వ తేదీన రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇవాళ చేపట్టారు.
17 స్థానాలకు గాను…. 8 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేయనుంది. ఇక మరో 8 స్థానాల్లో బీజేపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ప్రతి రౌండ్ కు సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. ఇక ఎంఐఎం ఎప్పటి మాదిరిగానే తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైపోయింది. కనీసం ఒక్కసీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆశలు పెట్టుకున్న స్థానాల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొటీ నడిచింది. ఫలితంగా…. గులాబీ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ ఫలితాల తర్వాత…. పార్టీ పరిస్థితి మరింత పడిపోయే అవకాశం ఉందన్న విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. దాదాపు అన్ని స్థానాల్లోనూ మూడో స్థానానికే పరిమితమైపోయింది.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభంజనం సృష్టించారు. 5, 41,241 మెజార్టీ మార్క్ ను దాటారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయితే… ఓట్ల మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది. రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు. ఇయన సోదరుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు. 4,56704 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి 4 లక్షల మెజార్టీ దాటింది.
మరోవైపు భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దాదాపు 204441 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విక్టరీ కొట్టారు. పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
తెలంగాణలో బీజేపీ పార్టీ సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించిన బీజేపీ… ఈసారి మరింత బలం పుంజుకుంది. ఏకంగా 8 స్థానాల్లో పాగా వేసేసింది. మహబూబ్ నగర్ లో చివరి నిమిషంలో 5 వేల మెజార్టీతో డీకే అరుణ గెలిచారు. ఈ స్థాయిలో తెలంగాణలో బీజేపీ సీట్లు గెలవటం ఇదే తొలసారి. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాలను కైవసం చేసుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది.