Peddapalli Congress candidate : ఎంపీ అభ్యర్థి మార్పునకు డిమాండ్..! పెద్దపల్లిలో సీన్ మారనుందా..?
Peddapalli Congress MP candidate : పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలన్న వాదన తెరపైకి వస్తోంది. దీంతో హైకమాండ్ డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
Peddapalli Congress MP candidate Vamsi Krishna: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పై(Peddapalli Congress MP candidate) మాదిగలు గుర్రుగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. మాదిగలకు కాకుండా మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే వంశీకృష్ణ ప్రచారంలో బిజీగా ఉండగా మాదిగలు మాత్రం కాంగ్రెస్ పార్టీ తమకు అన్యాయం చేస్తుందని ఆవేదనతో ఆందోళన చెందుతూ డిల్లీకి వెళ్ళి అధిష్టానం కు అల్టిమేట్ ఇచ్చారు.

ఏఐసీసీ కార్యాలయం ముందు నిరసన
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చాలని మాదిగ సంఘాలు చలో ఏఐసీసీ ఆఫీస్ పేరుతో మాదిగ దండోరా, మాదిగ జేఏసీ, మాదిగ శక్తి సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి చేరారు. ఏఐసీసీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను మార్చి గజ్జెల కాంతంకు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని పిడమర్తి రవికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ ఎంపీ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని కోరుతూ ఏఐసిసి కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ లో 18 లక్షలున్న మాలలకు ఎక్కువ సీట్లు ఇచ్చారని, 80 లక్షల మంది మాదిగలు ఉన్నా సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో రెండు ఎస్సీ స్థానాల్లో మాలలకే టికెట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి స్థానాన్ని మాదికులకు కేటాయించి అభ్యర్థిని మార్చాలని కోరారు. లేనిచో పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ప్రతాపం చూపుతామని హెచ్చరించారు.
కాక మనువడికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్..
పెద్దపల్లి లో కాంగ్రెస్ నుంచి 30 మంది టికెట్ ఆశించగా చివరకు కాంగ్రెస్ సీనియర్ నేత కాక గా సుపరిచితుడైన స్వర్గీయ వెంకటస్వామి మనువడు వంశీకృష్ణ ను అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించింది. బిఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ఈసారి టికెట్ రాదని ముందుగానే గ్రహించి 55 రోజుల క్రితం బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కారు దిగి కాంగ్రెస్ లో చేరి, చెయ్యెత్తి జై కొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఘనవిజయం సాధించడంతో వెంకటేష్ నేత మరో సారి ఎంపీ అవ్వాలని ఆశతో కాంగ్రెస్ లో చేరగా చివరకు కాంగ్రెస్ మొండిచెయ్యే చూపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అందులో చెన్నూరు నుంచి వంశీకృష్ణ తండ్రీ వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి పెద్దనాన్న వినోద్ గెలుపొందారు. వంశీకృష్ణ ను ఎంపీగా బరిలోకి దింపితే గెలుపు సునాయాసంగా ఉంటుందని భావిస్తు కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్ణ ను ఎంపిక చేసింది. పెద్దపల్లి నుంచి వెంకటస్వామి (కాక) నాలుగు సార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాక వారసుడిగా 2009 లో వివేక్ వెంకటస్వామి పోటీ చేసి ఎంపిగా గెలుపోందారు.
పెద్దపల్లి కాంగ్రెస్ కు కంచుకోట..
పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరుగగా 9 సార్లు కాంగ్రెస్, మూడుసార్లు టిడిపి, రెండు సార్లు టిఆర్ఎస్ ఒకసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి. కానీ బిజేపి మాత్రం ఒక్కసారి కూడా గెలువలేదు. కనీసం రెండో స్థానానికి సైతం రాలేదు. బిజేపికి ప్రాతినిధ్యం లేని నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ట్రై యాంగిల్ ఫైట్ జరుగనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ మూడు పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తు కధనరంగంలోకి దూకారు. గేలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బిఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపగా బిజేపి మోదీ నామజపంతో గోమాస శ్రీనివాస్ ను అభ్యర్థి గా ప్రకటించింది. మూడు ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైన పరిస్థితిలో కాంగ్రెస్ కు ఇంటిపోరు, మాదిగల ఆందోళన ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుంది.
మరోవైపు కడియం శ్రీహరి(Kadiyam Srihari) కాంగ్రెస్ లో చేరటం దాదాపు ఖాయంగా మారింది. అయితే ఆయనకు లేదా కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కడియం మాల సామాజికవర్గానికి చెందిన బైండ్ల ఉపకులానికి చెందిన నేత. ఇప్పటికే మల్లు రవితో పాటు గడ్డం వంశీకి ఎంపీ టికెట్లు ఖరారు కాగా… కడియం కుటుంబానికి కూడా టికెట్ దక్కితే…. అన్ని సీట్లు కూడా మాల సామాజికవర్గానికే ఇచ్చినట్లు అవుతుంది. ఫలితంగా మాదిగ సామాజికవర్గం నుంచి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…. పెద్దపల్లి విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ మొదలైంది.