Election Code Alert: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎన్నికల కోడ్‌ రానుండటమే కారణం…-telangana govt employees holidays canceled election code is coming ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Telangana Govt Employees Holidays Canceled.. Election Code Is Coming...

Election Code Alert: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎన్నికల కోడ్‌ రానుండటమే కారణం…

Sarath chandra.B HT Telugu
Mar 08, 2024 07:59 AM IST

Election Code Alert: ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు గల్లంతయ్యాయి. హైదరాబాద్‌లో వరుస సెలవుల్ని రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సిఎం బిజీబిజీ...  తెలంగాణలో ఉద్యోగులకు సెలవులు రద్దు!
ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సిఎం బిజీబిజీ... తెలంగాణలో ఉద్యోగులకు సెలవులు రద్దు!

Election Code Alert: తెలంగాణలో పలు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు Employees వరుస సెలవుల్ని Holidays రద్దు చేస్తూ అయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక సమయంలో వరుసగా మూడ్రోజులు ప్రభుత్వ సెలవులు వస్తే పనులకు అటంకం కలుగుతుందని భావించింది. దీంతో మార్చి 8,9,10 తేదీల్లో సెలవుల్ని రద్దు చేశారు. శివరాత్రి నుంచి ఆదివారం వరకు వచ్చిన సెలవుల్ని రద్దు చేశారు. 

ట్రెండింగ్ వార్తలు

దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ మార్చి రెండో వారంలో వెలువడితే నోటిఫికేషన్‌, ఎన్నికల నిర్వహణకు దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ ఖరారు చేస్తే తప్ప ఏప్రిల్ నెలాఖరుకు ఈ ప్రక్రియ కొలిక్కి రాదు. దీంతో వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం సెలవులు రద్దు చేసినట్టు తెలుస్తోంది.

2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10వ తేదీన వెలువడింది. 18వ తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 11న తొలి దశ పోలింగ్‌ జరిగింది. తొలి దశలోనే తెలంగాణలోని లోక్‌సభ స్థానాలతో పాటు, ఏపీలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 23న ఎన్నికల కౌంటింగ్‌ జరిగింది. ఈ సారి షెడ్యూల్‌ ఈ నెల 13న రావొచ్చని కథనాలు వెలువడ్డాయి.

తేదీ స్పష్టంగా ఖరారు కాకపోయినా మార్చి రెండో వారంలోనే షెడ్యూల్ ప్రకటిస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం మిగిలి పోయిన పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రారంభోత్సవాలు,సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

మరోవైపు ప్రధాని మోదీ కూడా దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రధాని స్వయంగా పాల్గొంటున్నారు. ఎన్డీఏ కూటమిలోకి భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించే ప్రక్రియలో కూడా బీజేపీ వేగం పెంచింది. దేశ వ్యాప్తంగా ప్రధాని ప్రచార సభల షెడ్యూల్ 13వ తేదీ వరకు ఉంది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడితే అధికార వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలతో బిజీబిజీగా ఉన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడితే మోడల్ కోడ్‌ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రచార కార్యక్రమాలకు ఆటంకంగా మారుతుందనే ఉద్దేశంతో పలు పథకాలను ముందే ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో అల్వాల్‌ వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మార్చి 8వ తేదీ శుక్రవారం ఓల్డ్‌ సిటీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులకు ఫరూక్‌నగర్‌ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. మీరాలం ట్యాంకు వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం, గోల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.

మార్చి 9న బైరామల్‌గూడ్‌ ఫ్లై-ఓవర్‌ను ప్రారంభించి, ఉప్పల్‌లో నల్ల చెరువు ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. బోయినపల్లి నుంచి ఆదిలాబాద్‌ మీదుగా నాగ్‌పూర్‌ వెళ్లే 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. మార్చి 11న భద్రాచలంలో వివిధ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 12న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వయం సహాయక బృందాల మహిళలతో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందనే అంచనాతో సిఎం బిజీ షెడ్యూల్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 8, 9, 10 తేదీల్లో ఎవరూ సెలవు పెట్టడానికి వీల్లేదంటూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలు ఉన్నందున ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. సిఎం పర్యటనలు జరిగే ఇతర జిల్లాల్లో కూడా కలెక్టర్లు సెలవులు రద్దు చేస్తున్నారు.

WhatsApp channel