Siddipet News : సిద్దిపేటలో విషాదం, ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు-siddipet woman died with heart attack at polling station after casting vote ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Siddipet News : సిద్దిపేటలో విషాదం, ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు

Siddipet News : సిద్దిపేటలో విషాదం, ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు

HT Telugu Desk HT Telugu
Updated May 13, 2024 10:57 PM IST

Siddipet News : యాభై ఏళ్లుగా క్రమం తప్పకుండా ఓటు వేసిన ఓ వృద్ధురాలు...ఇవాళ ఓటు వేసి పోలింగ్ కేంద్రం గేటు వద్దే ప్రాణాలు విడిచింది. సిద్దిపేట జిల్లాకు చెందిన సరోజన గుండెపోటుతో పోలింగ్ కేంద్రం వద్దే మరణించారు.

ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు
ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు

Siddipet News : సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ ఓటు వేసిన అనంతరం గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే చేర్యాల పట్టణానికి చెందిన ఇప్పకాయల సరోజన (75) ఎన్నికలలో భాగంగా తన ఓటును వేయడానికి పెద్దమ్మ గడ్డ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడ సరోజన ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సరోజన గత యాభై సంవత్సరాల నుంచి తన ఓటును వినియోగించుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎండను కూడా లెక్కచేయకుండా వచ్చి ఓటు వేసిన తర్వాతనే మృతి చెందిందని కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చేర్యాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం

బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలు కప్పుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇరువర్గాల నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చేర్యాల పట్టణంతో పాటు, దూల్మిట్ట మండలం భైరన్ పల్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలతో చేర్యాల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 40 బూత్ వద్ద, పెద్దమ్మ గడ్డ బాలుర పాఠశాల పోలింగ్ కేంద్రాలకు, దూల్మిట్ట మండలం భైరన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు బీఆర్ఎస్ పార్టీ నాయకులూ కండువాలతో ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తనయుడు కొమ్మూరి రాకేష్ రెడ్డి అభ్యతరం వ్యక్తం చేశారు.

అలాగే చేర్యాల మండల కేంద్రంలో రెండు పోలింగ్ కేంద్రాల వద్దకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చారు. ఎమ్మెల్యే వచ్చిన క్రమంలో కూడా బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాల వద్దకు రావడంతో కాంగ్రెస్ నాయకులు రాకేష్ రెడ్డి అభ్యతరం చెప్పాడు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ రెడ్డికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి, గొడవను సద్దుమణిగించారు.

Whats_app_banner