Sangareddy : ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగుల సస్పెండ్-sangareddy collector valluri kranthi suspended 35 govt employee not attend election duties ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Sangareddy : ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగుల సస్పెండ్

Sangareddy : ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగుల సస్పెండ్

HT Telugu Desk HT Telugu
May 11, 2024 05:00 PM IST

Sangareddy : సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగులను కలెక్టర్, ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి సస్పెండ్ చేశారు.

 ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగుల సస్పెండ్
ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగుల సస్పెండ్

Sangareddy : ఎన్నికల విధుల పట్ల నిర్లక్షంగా వ్యహరించిన ఉద్యోగుల పట్ల, సంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి కొరడా ఝళిపించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల శిక్షణకు హాజరు కాని 35 మంది ఉద్యోగులను సంగారెడ్డి ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరి క్రాంతి సస్పెండ్ చేశారు. వివిధ శాఖలకు చెందిన 35 మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరు కాలేదని వారికి నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. కాగా ఉద్యోగులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో తాను చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాని సిబ్బంది

2024 పార్లమెంటు ఎన్నికలకు పీఓలు, ఏపీఓలు, ఓపీఓల ఎన్నికల శిక్షణకు హాజరు కావాలని తాకీదులు అందజేశారు. అయినా ఉద్యోగులు ఎన్నికల శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. వీరిలో నీటిపారుదల శాఖ, బీసీ సంక్షేమ శాఖ ,అల్ప సంఖ్యా వర్గాల శాఖ , గ్రామీణ నీటిపారుదల శాఖ, సాంఘిక సంక్షేమశాఖ, గిరిజనాభివృద్ధి శాఖ , శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖలకు సంబంధించిన 35 మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో తెలిపారు.

వర్షాలు పడ్డా ఈవీఎంలు తడవకుండా జాగ్రత్తలు

మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలను మరింత మెరుగైన రీతిలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ లను వేరు చేస్తూ, సంబంధిత సెగ్మెంట్లకు పంపించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలన్నారు. ఒకవేళ వర్షాలు కురిసినా ఈవీఎంలు,ఇతర పోలింగ్ సామాగ్రి తడిసిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నగదు, మద్యం పంపిణీపై దృష్టి పెట్టండి

పోలింగ్ కు మరికొద్ది గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నగదు, మద్యం, విలువైన వస్తువుల పంపిణీ వంటి వాటిపై గట్టి నిఘా పెట్టాలని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని సూచించారు. ముఖ్యంగా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయించాలన్నారు. మాక్ పోల్, పోలింగ్ ప్రక్రియల సందర్భంగా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే, ఈ.సీ మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ముగ్గురు చొప్పున ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని, సెక్టోరల్ అధికారులు వారిని సంప్రదించేలా చూడాలన్నారు. నిర్దేశిత సమయానికి పోలింగ్ ప్రారంభం అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

సంబంధిత కథనం