‌Hyderabad Polling: గ్రేటర్‌లో తగ్గిన పోలింగ్ శాతం, ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్? ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత?-reduced polling percentage in greater hyderabad ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  ‌Hyderabad Polling: గ్రేటర్‌లో తగ్గిన పోలింగ్ శాతం, ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్? ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత?

‌Hyderabad Polling: గ్రేటర్‌లో తగ్గిన పోలింగ్ శాతం, ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్? ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత?

HT Telugu Desk HT Telugu
May 14, 2024 09:15 AM IST

‌Hyderabad Polling: లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌‌లో పోలింగ్ శాతం తగ్గడం ఎవరిపై ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ తగ్గడంలోపై ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత అనే చర్చ కూడా జరుగుతోంది.

గ్రేటర్ హైదరాబాాద్‌లో భారీగా తగ్గిన ఓటింగ్
గ్రేటర్ హైదరాబాాద్‌లో భారీగా తగ్గిన ఓటింగ్

‌Hyderabad Polling: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఎప్పటిలాగానే పల్లె ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తగా, అర్బన్ ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం ప్రతి ఎన్నికకు తగ్గుతూ వచ్చింది.

రూరల్ ఓటింగ్ శాతం కొంత మెరుగ్గానే ఉన్నా.....అర్బన్ ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి పరిస్థితి తారుమారు అయిందనే చెప్పాలి. ఫలితంగా ఓటింగ్ సరళిని కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు.దీంతో ఇప్పటివరకు తమ గెలుపు పై ధీమా వ్యక్తం చేసిన అభ్యర్థులు కాస్త అయోమయంలో పడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ లో 46.08%, సికింద్రబాద్ లో 48.11%,మల్కాజిగిరి లో 50.12%,చేవెళ్ల 55.5% ఓటింగ్ నమోదు అయింది.కాగా హైదరాబాద్ పరిధిలో ఓటర్లు సాయంత్రం 4 తరువాతే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళారు.తక్కువ పోలింగ్ శాతం నమోదు అవుతుండడంతో ఇటు మజ్లిస్ కార్యకర్తలు హైదరాబాద్ లో ఇల్లిల్లూ తిరుగుతూ బయటికి వచ్చి ఓటు వేయాలని కోరారు.

దీంతో చాలా మంది తీరా పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.దీంతో 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారందరికి ఓటు వేసే హక్కు ఎన్నికల సంఘం కల్పించడంతో హైదరాబాద్ లోని పలు కేంద్రాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.

పోలింగ్‌‌పై ఆంధ్రా ఓటర్ల ప్రభావం…

గ్రేటర్ హైదరాబాద్ లోని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక మంది ఓటర్లు చాలా వరకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. దీంతో వారికి ఇటు తెలంగాణతో పాటు ఏపీ లో కూడా ఓటు హక్కు ఉంది.

ఏపీలో శాసనసభ,లోక్ సభ ఎన్నికలు కీలకంగా మారడంతో, ప్రజలంతా అక్కడ ఓటు వేసేందుకే మొగ్గు చూపి,పెద్ద సంఖ్యలో ఏపీకి వెళ్ళారు. అందువల్లే పోలింగ్ శాతం పడిపోయిందని భావిస్తున్నారు.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా పెద్దగా ఓటింగ్ నమోదు కాలేదు.కేవలం 55.45 శాతం నమోదు అయింది.చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని శేరిలింగంపల్లి లో సైతం చాలా వరకు ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఉంటారు.వారంతా ఏపికి వెళ్ళడంతో ఇక్కడ పోలింగ్ శాతం తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సికింద్రాబాద్ లో కేవలం 48.11 శాతమే…

సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో ఈసారి కేవలం 48.11% మాత్రమే పోలింగ్ నమోదు అయింది.దీంతో ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములు డేంజర్ లో పడ్డాయనే చెప్పాలి.ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్కువగా అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్ల పైనే ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్,బిఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మ రావు గౌడ్ కు మాత్రం బస్తీ ఓటర్ల పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు.కాగా పోలింగ్ శాతం ఊహించని రీతిలో తగ్గడంతో ఎవరు ఎటువైపు టర్న్ అయ్యారో అర్థం గాక అభ్యర్ధులు టెన్షన్ పడుతున్నారు.దీంతో ఇప్పటివరకు తమ గెలుపు ఖాయం అనుకున్నా అభ్యర్థులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

17 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ శాతం ఇలా.....

అదిలాబాద్ - 72.96%

పెద్దపల్లి - 67.88%

కరీంనగర్ - 72.33%

నిజమాబాద్ - 71.50%

జహీరాబాద్ - 74.54%

మెదక్ - 74.38%

మల్కాజిగిరి - 50.12%

సికింద్రబాద్ - 48.11%

హైదరాబాద్ - 46.08%

చేవెళ్ల - 55.45%

నల్గొండ - 73.78%

మహబూబ్ నగర్ - 70.68%

నాగర్ కర్నూల్ - 68.86

వరంగల్ - 68.29%

ఖమ్మం - 75.19%

భువనగిరి - 76.47%

(రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్)

Whats_app_banner