Karimnagar Polling: పోలింగ్ ముగిసింది, గెలుపుపై ఎవరి ధీమా వారిదే, మరో మూడు వారాలు టెన్షన్..-polling is over all are confident of winning tension for three more weeks ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Polling: పోలింగ్ ముగిసింది, గెలుపుపై ఎవరి ధీమా వారిదే, మరో మూడు వారాలు టెన్షన్..

Karimnagar Polling: పోలింగ్ ముగిసింది, గెలుపుపై ఎవరి ధీమా వారిదే, మరో మూడు వారాలు టెన్షన్..

HT Telugu Desk HT Telugu
May 14, 2024 11:00 AM IST

Karimnagar Polling: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓట్ల పండుగ ముగిసింది. ప్రజాతీర్పు మిగిలింది. మరో మూడు వారాలు తీర్పు కోసం వేచిచూడాల్సిన అవసరం ఏర్పడింది.

కరీంనగర్‌ ఫలితాలపై ఎవరి దీమా వారిదే
కరీంనగర్‌ ఫలితాలపై ఎవరి దీమా వారిదే

Karimnagar Polling: తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండడంతో అప్పటి వరకు అందరు పోలింగ్ సరళిపైనే చర్చ సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేసిన రాజకీయ పార్టీల నేతలు, అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానపార్టీల అభ్యర్థులు నాయకులు కాలికిబట్టకట్టకుండా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో ఓటింగ్ సరళిపై లెక్కల్లో మునిగి తేలారు.

పోలింగ్ బూత్ ల వారిగా పోలైన ఓట్లు అనుకూల ప్రతికూల ఓట్లపైన ఆరా తీస్తున్నారు. కూడికలు తీసివేతలతో ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కుటుంబసభ్యులకు దూరంగా బిజీగా గడిపిన నేతలు రెండు వారాలపాటు విహార యాత్రలకు బయలు దేరుతున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ పోలింగ్ ముసిగిన మరుసటి రోజే అమెరికాకు పయనమయ్యారు. జూన్ 1న తిరిగి రానున్నారు. అలానే ప్రధానపార్టీల నేతలు టూర్ ప్లాన్ లో ఉన్నారు.

పోటెత్తిన ఓటర్లు...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఓటర్లు పోటెత్తారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుని ఓటేశారు. వాతావరణం అనుకూలించడంతో ఈసారి ఉమ్మడి జిల్లాలో 71.32 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరిగింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు ఉండగా 12 లక్షల 99 వేల 878 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 72.33 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 96 వేల 430 మంది ఓటర్లు ఉండగా 10 వేల 83 వేల 656 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 67.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ పెరగడంతో ఎవరికి వారే తమకు అనుకూలంగా ఫలితం ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్ భావిస్తున్నాయి.

ఎవరికి అనుకూలం ...ఎవరికి ప్రతికూలం

పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ ముగియడంతో పోలింగ్ శాతాన్ని బట్టి ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలంగా ఉంటుందనే చర్చ సాగుతుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు పోటీ చేయగా ప్రధానంగా బిజేపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్యనే పోటీ సాగింది.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ పోటీ చేశారు. నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభం నాటికి బిజేపి బిఆర్ఎస్ మద్య పోటీ ఉండగా పోలింగ్ ముగిసే సరికి అన్యూహ్యంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.

బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన పోలింగ్ సరళిని చూస్తే బిజేపికి అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా కాంగ్రెస్ రెండో స్థానం దక్కించుకోనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలను బిఆర్ఎస్, నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికి కాంగ్రెస్ కంటే 5249 ఓట్ల అధికంగా బిఆర్ఎస్ పొందింది. బిజేపి మూడో స్థానంలో ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బిజేపి మొదటి స్థానానికి ఎగబాకగా బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి.

పెద్దపల్లిలో అనూహ్య పరిణామం...

ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లి నుంచి ఈసారి 42 మంది పోటీ చేశారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బిఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బిజేపి నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేశారు.

నామినేషన్ ల ప్రక్రియ ముగిసే వరకు బిజేపి మూడో స్థానంలో ఉంది. కానీ పోలింగ్ ముగిసే వరకు అనూహ్యంగా బిజేపి బలం పెరిగి బిఆర్ఎస్ బలహీనంగా మారిందిం. ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మూడు లక్షల పైచిలుకుఓట్లు ఎక్కువ పొందింది.

పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపు తధ్యమని అందరు భావిస్తున్నారు. కానీ పోలింగ్ సరళిని చూస్తే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా బిజేపి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అనూహ్యంగా బిజేపికి బారీగానే ఓట్లు పోలైనట్లు సర్వే రిపోర్ట్ లు తేలుస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బిజేపి మద్య గట్టి పోటీ ఉండడంతో ఎవరు గెలిచిన స్వల్ప ఓట్ల మెజార్టే ఉంటుందనే అబిప్రాయం వ్యక్తమవుతుంది. అనూహ్యంగా బిజేపి పుంజుకోవడంతో బిఆర్ఎస్ అంతర్మథనంలో పడింది.

ఇందూరులో ఓటర్ల తీర్పు ఎటు?

ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేశారు. బిజేపి నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బిఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో నిలిచారు. కాంగ్రెస్, బిజేపి మద్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది.

పోలింగ్ సరళిని బట్టి చూస్తే జీవన్ రెడ్డికి అనూకూలంగా ఉంటుందని భావించిన జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ కు ఓట్లు రాలేదని స్ఫష్టమవుతుంది. బీజేపికి అనుకూల పవనాలు వీచినట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డి ఇలాకలోనే కాంగ్రెస్ కు ప్రతికూల పరిస్థితి ఉండడంతో నిజామాబాద్ లో రెండో సారి బిజేపికి చెందిన ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలుస్తాడనే చర్చ బలంగా సాగుతుంది.

మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది. ఓటింగ్ సరళిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న ప్రధాన పార్టీల నాయకులు బిజిగా మారారు. బలం బలహీనతలపై బేరీజు వేసుకుంటు బహాటంగా మాత్రం గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. ఏదేమైన ఓటర్ల తీర్పు స్పష్టంగా బయటపడాలంటే జూన్ 4 వరకు వేట్ చేయాల్సి ఉంది.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

సంబంధిత కథనం