Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!-peddapalli politics cross voting to bjp congress vote share may decrease ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

HT Telugu Desk HT Telugu
May 18, 2024 10:10 PM IST

Peddapalli Politics : పెద్దపల్లి ఓటింగ్ సరళిని చూస్తూ బీజేపీ బలాన్ని పుంజుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుందంటున్నారు.

అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!
అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Peddapalli Politics : పెద్దపల్లిలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయా? కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ పాగా వేయనుందా? అంటే, జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఔననే సమాధానం వస్తుంది. నామినేషన్ ల ప్రక్రియ వరకు మూడో స్థానానికే పరిమితం అవుతుందని భావించిన బీజేపీ అనూహ్యంగా పోలింగ్ నాటికి తన బలాన్ని పెంచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని అందరూ భావించినప్పటికీ పోలింగ్ సరళిని బట్టి పరిశీలిస్తే ఎవరు ఉహించని విధంగా బీజేపీకి ఓట్లు పోలైనట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఏర్పడింది. కచ్చితంగా ఎవరు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేయడంలేదు. దానికి ప్రధాన కారణం పోలింగ్ రోజున చోటుచేసుకున్న పరిణామాలేనని అన్ని పార్టీల నాయకులు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ తో బీజేపీకి మేలు జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది.

త్రిముఖ పోటీలో అనూహ్యంగా ముందుకొచ్చిన బీజేపీ

ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పోటీ చేశారు. నామినేషన్ ల చివరిరోజు వరకు బీజేపీ అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరగడంతో శ్రీనివాస్ పెద్దగా ప్రచారమే చేయలేదు. కానీ అనూహ్యంగా పోలింగ్ రోజు వరకు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీకి మంచి స్పందన లభించింది. జనం ఓట్ల రూపంలో బీజేపీకి మద్దకు ఇచ్చారు. అక్కడ అభ్యర్థిని చూడకుండా దేశం కోసం ధర్మం కోసం మోదీ నినాదంతో బీజేపీకి ఓట్లు వేసినట్లు అర్థమవుతుంది. పోలింగ్ సరళిని చూస్తే గెలిచినా అశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆ స్థాయిలో బీజేపీకి ఓట్లు రావడానికి క్రాస్ ఓటింగే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గడ్డం వంశీకృష్ణకు గడ్డుకాలమేనా

పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని ఎన్నికల ముందు వరకు అందరు భావించారు. కానీ పోలింగ్ రోజున మారిన పరిణామాల నేపథ్యంలో ఇప్పడు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎదురీత తప్పదని బాహాటంగా చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటికి ఏడు కాంగ్రెస్ గెలుపొందింది. గెలిచిన వారిలో చెన్నూరు నుంచి వంశీకృష్ణ తండ్రి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి పెద్దనాన్న వినోద్ వెంకటస్వామి ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు లక్షలపై చిలుకు ఓట్లు సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పై సాధించకలిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని అందరు భావించారు. కానీ మారిన పరిస్థితుల నేపద్యంలో పోల్ డే రోజు సీన్ మొత్తం మారి అనూహ్యంగా బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయి. మంథని అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా ఆరు సెగ్మెంట్లలో బీజేపీకి బారీగానే ఓట్లు పోలైనట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు మొదలయ్యింది. అభ్యర్థులతోపాటు నేతల్లో టెన్షన్ నెలకొంది.

పెద్దపల్లిలో 67.87 శాతం పోలింగ్

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1596430 మంది ఓటర్లు ఉండగా 13న జరిగిన పోలింగ్ లో 1083453 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 67.87 శాతం పోలింగ్ నమోదు అయిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు విజయఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ కు పెద్దదెబ్బగా మారనున్నదనే భయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగినప్పటికి పోల్ డే రోజునాటి పరిస్థితితో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ రెండుపార్టీల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్జీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

WhatsApp channel

సంబంధిత కథనం