Lok Sabha Elections 2024 : ఆఫీసర్ల చూపు ఎంపీ టికెట్ వైపు..!
Telangana MP Tickets 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ పలువురు అధికారులు ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని రెండు స్థానాలపై పలువురు ఆఫీసర్లు గురి పెట్టారు.
Warangal MP Ticket 2024: లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పార్టీలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతుండగా.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతున్న అధికారుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానలు ఉండగా.. ఆ రెండు చోట్లా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వివిధ స్థాయుల్లో ఉద్యోగాలు చేస్తున్న కొందరు అధికారులు ఎంపీ టికెట్ కోసం పార్టీ అగ్రనేతల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రాజకీయ నేతల కంటే.. పార్లమెంటులో అడుగు పెట్టాలని ఆశపడుతున్న అధికారుల సంఖ్యే ఎక్కువ కనపడుతోంది.
ఒకటి ఎస్సీ.. ఒకటి ఎస్టీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. అందులో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాగా.. మరోటి మహబూబాబాద్ ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానం. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్లమెంట్ బరిలో నిలిచేందుకు నేతలు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు క్యాడర్ ను పోగేసుకుని పనిలో పడటంతో పాటు గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. తమకు టికెట్ కేటాయిస్తే పార్టీని గెలిపించి తీరుతామంటూ నమ్మకం కలిగించే పనిలో పడుతున్నారు.
వరంగల్ టికెట్ కోసం ఇలా..
రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరంగల్ ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన దొమ్మటి సాంబయ్య, అద్దంకి దయాకర్ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు కూడా నడుస్తోంది. వీరంతా పొలిటికల్ లీడర్లు కాగా.. కొంతమంది అధికారులు కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న హరికోట్ల రవి ఇప్పటికే టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ లో కీలకమైన రామసహాయం సురేందర్ రెడ్డితో చర్చించిన ఆయన పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు రాహుల్గాంధీని కూడా కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు టీఎస్ ఎన్పీడీసీఎల్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తున్న పరికి సదానందం కూడా టికెట్ పై ఆశలు పెట్టుకుని గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు ఫిజియోథెరపీ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, మరో డాక్టర్ పులి అనిల్ కుమార్ కూడా ప్రయత్నాలు తీవ్రం చేశారు. అంతేగాకుండా ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బరిగెల రమేశ్ పేరు కూడా ప్రధానంగా టికెట్ రేసులో వినిపిస్తోంది. పరకాలతో పాటు మిగతా నియోజకవర్గాల్లో మంచి పేరుండటంతో టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారాయన.
మహబూబాబాద్ టికెట్ కు ఇలా..
మహబూబాబాద్‌లో అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ నేతలు బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ ఆసక్తితో ఉండగా.. ఇక్కడా అధికారుల తాకిడి ఎక్కువగానే ఉంది. గతంలో మహబూబాబాద్ డీఎస్పీగా పని చేసిన ఖమ్మం జిల్లా వాసి నాగరాజునాయక్ మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తుండగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ భట్టు రమేష్ కూడా ఇదే స్థానంలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. టికెట్ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
పార్టీల నేతలకు టెన్షన్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అధికారులు బరిలో నిలిచి విజయం అందుకున్నారు. అదే స్ఫూర్తితో కొందరు అధికారులు ఎంపీ టికెట్ కోసం క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో ప్రధాన పార్టీలు కూడా సత్తా ఉన్న అధికారులను బరిలో దించడానికైనా మొగ్గు చూపేందుకు రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే కొందరు నేతల్లో టెన్షన్ పట్టుకుంది. ఇన్నేళ్లు పార్టీని పట్టుకుని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తే అధిష్ఠానాలు అధికారుల వైపు మొగ్గు చూపడమేంటని కొందరు నేతల్లో చర్చ జరుగుతోంది. కాగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు ఎంపీ సీట్లు గెలుచుకోవడం కీలకం కాగా.. గెలుపు అవకాశం ఉన్న నాయకుల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరి ఏ పార్టీ ఎవరెవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.
(రిపోర్టింగ్ : హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)