Mulugu News : ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక, ఆదర్శం పెనుగోలు గిరిజనులు-mulugu penugolu tribal walked 16 kilometers to cast vote in lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mulugu News : ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక, ఆదర్శం పెనుగోలు గిరిజనులు

Mulugu News : ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక, ఆదర్శం పెనుగోలు గిరిజనులు

HT Telugu Desk HT Telugu
May 13, 2024 10:35 PM IST

Mulugu News : అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నా, కాస్త దూరంలోనే పోలింగ్ కేంద్రం ఉన్నా...ఓటు వేయని మహానుభావులు ఎందరో. కానీ ఓటు వేసేందుకు మాత్రం 16 కిలోమీటర్లు కొండలు, వాగులు, వంకలు దాటుకుని వచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతను నిర్వర్తించారు ఆ గిరిజనులు.

ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక
ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక

Mulugu News : ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఆయుధం చేతిలోనే ఉన్నా మనకెందుకులే అంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంకొందరైతే పోలింగ్ డేను సెలవు దినంగా భావించి, ఓటు వేయకుండా విహార యాత్రలకు వెళ్తుంటారు. చదువుకోకుండా నిర్లక్ష్యం చేసేవారు కొందరైతే.. చదువుకుని మూర్ఖంగా ఆలోచించేవాళ్లు ఇంకొందరు. కానీ ఉమ్మడి వరంగల్ లోని ములుగు జిల్లాలోని పెనుగోలు అనే చిన్నపాటి గూడెంకు చెందిన ప్రజలు మాత్రం కాలినడకన కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి, ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయమే గూడెం నుంచి బయలు దేరి కొండా కోనలు, వాగూ వంకలు దాటుకుంటూ వచ్చి ములుగు జిల్లాలోని జంగాలపల్లి పోలింగ్​ కేంద్రంలో ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు.

మూడు వాగులు.. 16 కిలోఈమీటర్లు

ములుగు జిల్లా వాజేడు మండలం అటవీ ప్రాంతంలో పెనుగోలు అనే చిన్నపాటి గూడెం ఉంది. ములుగు జిల్లా కేంద్రానికి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్​ గడ్​ సరిహద్దు ప్రాంతంలో ఉంటుందీ కుగ్రామం. ఇక్కడ దాదాపు 13 గిరిజన కుటుంబాలు ఉంటుండగా.. మొత్తంగా 43 మంది వరకు నివసిస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ గూడెంకు సరిగా రోడ్డు సౌకర్యం కూడా లేదు. అటవీ ప్రాంతంలో ఉండటం, అందులోనూ మావోయిస్టుల బెడద ఉండటంతో అధికారులు ఇక్కడ పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేయలేదు. కానీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకున్నా అక్కడి ప్రజలు మాత్రం ఓటుకు దూరంగా ఉండిపోలేదు. అక్కడి ప్రజలకు ములుగు జిల్లా జంగాలపల్లిలో పోలింగ్​ కేంద్రం కేటాయించగా.. ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పెనుగోలు గ్రామానికి చెందిన దాదాపు 11 మంది ఓటర్లు సోమవారం ఉదయం దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కాలినడకన బయలు దేరారు. అక్కడి నుంచి జంగాలపల్లి దాదాపు 16 కిలోమీటర్లు ఉండగా.. మధ్యలో మూడు వాగులు దాటి ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ మేరకు ఉదయం బయలు దేరిన పెనుగోలు గ్రామానికి చెందిన 11 మంది గిరిజనులు ఆ మూడు వాగులు, కొండాకోనలు దాటి జంగాలపల్లికి చేరుకున్నారు. అక్కడి పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఎలాంటి రవాణా సదుపాయం లేకున్నా 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల అక్కడి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.

సరుకులు కావాలన్నా ఇబ్బందే..

ములుగు జిల్లాలో ఛత్తీస్​ గడ్​ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెనుగోలు గుట్టల్లో నివసిస్తున్న గిరిజనుల పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడికి సరైన రోడ్డు రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడంపై పాలకులు, అధికారులు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దీంతోనే కనీస అవసరాలకు కూడా ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ ప్రాంతంలో దొరికే ఉత్పత్తులను ప్రతి బుధవారం వాజేడులో జరిగే వారాంతపు సంతకు కాలినడకన తీసుకురావడం, వాటిని అక్కడ విక్రయించి వచ్చిన డబ్బుతో నిత్యావసర సరుకులు తీసుకెళ్లడం చేస్తుంటారు. కనీసం రేషన్ బియ్యం తీసుకోవాలన్నా వాగులు, వంకలు దాటుకుని రావాల్సిన పరిస్థితి. ఇక వర్షాకాలం వచ్చిందంటే పెనుగోలుకు , బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినట్టే. ఒకవేళ ఏదైనా అత్యవసర వైద్యం అందించాలన్నా తిప్పలు పడక తప్పని పరిస్థితి. దీంతో పెనుగోలు ప్రజలు నానా యాతన పడుతున్నారు. ప్రభుత్వం దృష్టిలో ఓటర్లుగా నమోదై ఉన్నా.. కనీసం తమను పట్టించుకునే నాథులే లేరని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించి, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం