Lok Sabha election results: 20 శాతం వరకు పతనమైన మల్టీ బ్యాగర్ స్టాక్స్, పీఎస్యూ స్టాక్స్
Lok Sabha election results: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇన్వెస్టర్ల ఆందోళనలు పెరిగాయి. ఇది భారతీయ స్టాక్స్ లో గణనీయమైన తిరోగమనానికి కారణమైంది. పీఎస్ యూ సెక్టార్ భారీ నష్టాలను చవిచూడగా, పీఎఫ్ సీ, ఆర్ ఈసీ తదితర షేర్లు 20 శాతం పైగా నష్టపోయాయి.
Lok Sabha election results: గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం చవిచూశాయి. ఎన్డీయే ఆశించిన మెజారిటీ సాధించలేదనే ఎర్లీ ట్రెండ్స్ గణాంకాలు సూచించడంతో, మంగళవారం ఉదయం నుంచే స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైంది. దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్స్ రోజంతా నష్టపోయాయి. ముఖ్యంగా, పీఎస్ యూ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయాయి. మొత్తంగా మధ్యాహ్నం 1.30 సమయానికి ఇన్వెస్టర్లు 38 లక్షల కోట్లు నష్టపోయారు.
మల్టీబ్యాగర్ స్టాక్స్
నేటి ట్రేడింగ్ సెషన్ లో పీఎఫ్ సీ, ఆర్ ఈసీ వంటి మల్టీబ్యాగర్ పీఎస్ యూ స్టాక్స్ 20 శాతం చొప్పున క్షీణించాయి. పిఎఫ్ సి సోమవారం గరిష్ట స్థాయి రూ.559 నుంచి రూ.429కి పడిపోగా, ఆర్ ఈసీ రూ.607.80 నుంచి రూ.472.40కి పడిపోయింది. కాగా, ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడం వల్ల, స్టాక్ మార్కెట్లో నెలకొన్న పతనం ఇన్వెస్టర్లను రూ.38 లక్షల కోట్లకు ముంచేసింది. ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సీ, రైల్ టెల్ కార్పొరేషన్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి మల్టీబ్యాగర్ పీఎస్యూ స్టాక్స్ కూడా నేటి ట్రేడింగ్ లో 15 శాతం వరకు క్షీణించాయి. దీనికి తోడు డిఫెన్స్ పీఎస్ యూ స్టాక్స్ అయిన మజగావ్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, భారత్ డైనమిక్స్ షేర్లు 15 శాతం వరకు నష్టపోయాయి.
భారీ నష్టాల్లో పీఎస్యూ స్టాక్స్
మంగళవారం మొత్తం పీఎస్యూ రంగం దెబ్బతింది. అన్ని పీఎస్యూ సెక్టోరల్ ఇండెక్స్ లు 10% కంటే ఎక్కువ నష్టపోయాయి. నిఫ్టీ సీపీఎస్ఈ 15 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 16 శాతం, నిఫ్టీ పీఎస్ఈ 20 శాతం, ఎస్ అండ్ పీ బీఎస్ ఈ పీఎస్ యూ 15 శాతం నష్టపోయాయి. మరోవైపు మార్కెట్ ఒడిదుడుకుల మధ్య బీఎస్ఈ పవర్ కూడా 13 శాతానికి పైగా పతనమైంది. అలాగే, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎల్సీ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా, ఎస్జేవీఎన్, ఎన్హెచ్పీసీ, ఎన్బీసీసీ (ఇండియా) వంటి ఇతర పీఎస్యూ షేర్లు 13 శాతం నుంచి 20 శాతం మధ్య క్షీణించాయి.
పీఎస్యూ బ్యాంకింగ్ లోనూ నష్టాలు
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లు కూడా భారీగా నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 19.6 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ 14.4 శాతం నుంచి 19 శాతం మధ్య నష్టపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగా ఎన్డీయే ఘన విజయం సాధించే అవకాశం కనిపించడం లేదు. ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లే విషయంలో ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పనపై దృష్టి సారించే అవకాశం ఉంది.