Miryalaguda to Nalgonda : మిర్యాలగూడ లోక్ సభ నియోజకవర్గం నల్గొండగా ఎలా మారింది?
Miryalaguda to Nalgonda : 2008 వరకూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, నల్గొండ రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ లోక్ సభ స్థానం రద్దైంది.
Miryalaguda to Nalgonda : ఉమ్మడి నల్గొండ (Nalgonda)జిల్లాలో 2004 పార్లమెంటు ఎన్నికల వరకు రెండు లోక్ సభా నియోజకవర్గాలు(Lok Sabha Constituencies) ఉండేవి. ఒకటి మిర్యాలగూడ, రెండు నల్గొండ. ప్రస్తుతం నల్గొండ ఉనికిలో ఉన్నా.. మిర్యాలగూడ అంతర్ధానమైంది. 2008లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ లోక్ సభ నియోజకవర్గం(Miryalaguda Loksabha) రద్దయ్యింది. 1962 లో ఏర్పాటైన మిర్యాలగూడకు 2004 దాకా ఎన్నికలు జరిగాయి. మిర్యాలగూడ నియోజకవర్గం నల్గొండగా, నల్గొండ లోక్ సభ స్థానం భువనగిరిగా మారాయి. పునర్విభజనకు పూర్వపు నల్గొండ నియోజకవర్గంలో హైదరాబాద్(Hyderabad) నగరంలోని మలక్ పేట అసెంబ్లీ సెగ్మెంటు ఉండేది. కానీ పునర్విభజన తర్వాత నల్గొండ నియోజకవర్గం భువనగిరిగా మారగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ఉమ్మడి రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని ఇబ్రహీంపట్నంతో నల్గొండ నియోజకవర్గం కాస్తా, భువనగిరిగా మారిపోయింది. నల్గొండగా మారిన, మిర్యాలగూడ లోక్ సభ నియోజకవర్గానికి ఉన్న చరిత్ర తెలుసుకోదగినదే.
మిర్యాలగూడకు 12 సార్లు ఎన్నికలు
1962లో ఏర్పాటైన మిర్యాలగూడ(Miryalaguda) లోక్ సభ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. నియోజకవర్గం ఏర్పాటైన 1962లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి సీపీఐ విజయం సాధించింది. ఆ తర్వాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చీలిక రావడం, సీపీఎం ఏర్పాటు కావడంతో వామపక్షాల బలం చీలిపోయి 1967 లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా, 1967 ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాట సేనాని భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) తొలిసారి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. బీఎన్ 1971, 1991 లో మరో రెండు సార్లు సీపీఎం నుంచి గెలిచారు. మొత్తంగా సీపీఎం(CPM) ఇక్కడి నుంచి మూడు విజయాలు నమోదు చేయగా వామపక్షాల రూపంలో నాలుగు పర్యాయాలు గెలిచింది. మిగిలిన 8 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సొంతం చేసుకుంది. 1977, 1980 ఎన్నికల్లో వరసగా రెండు సార్లు కాంగ్రెస్(Congress) అభ్యర్థులు గెలిచారు. మరో మారు కాంగ్రెస్ నుంచి 1989లో బద్దం నర్సింహారెడ్డి గెలిచారు. ఆయన కూడా మొత్తంగా మూడు సార్లు 1989, 1996, 1998 లో గెలిచి భీమిరెడ్డి (సీపీఎం) మూడు విజయాల రికార్డును సమం చేశారు. ఆ తర్వాత జరిగిన 1999, 2004 ఎన్నికల్లో వరసగా రెండు సార్లు ఎస్. జైపాల్ రెడ్డి(Jaipal Reddy) కాంగ్రెస్ కు విజయాలు అందించారు.
కేంద్ర మంత్రిగా... మిర్యాలగూడ ఎంపీ జైపాల్ రెడ్డి
ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాకు సరిహద్దుగా ఉండే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి(Jaipal Reddy) జనతా పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్(Congress) గూటికి చేరాక, ఆయనకు మిర్యాలగూడ(Miryalaguda) లోక్ సభ నియోజకవర్గం ఆశ్రయం ఇచ్చింది. ఆయన ఇక్కడి నుంచి 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2008లో నియోజకవర్గం రద్దయ్యాక జరిగిన 2009 ఎన్నికల్లో జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి చేవెళ్లకు వసల వెళ్లి ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, 2004 లో గెలిచాక కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించారు. అలా ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేంద్ర మంత్రి (Central Minister)పదవి దక్కడం అదే తొలిసారి, అదే చివరిసారి కావడం గమనార్హం. జైపాల్ రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడంలో మిర్యాలగూడ అందించిన విజయమే ప్రధానం. నాడు మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ ఇప్పుడు నల్గొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. పేరు మాత్రమే మారిపోవడంతో మిర్యాలగూడ పేరు 2009 ఎన్నికల నుంచి లేకుండా పోయింది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )
సంబంధిత కథనం